నేడు ఖ‌మ్మంలో BRS భారీ బ‌హిరంగ స‌భ‌

హాజ‌రు కానున్న ఢిల్లీ, కేర‌ళ సీఎంలు, యూపీ మాజీ సీఎం పొంగులేటికి చెక్‌, ఏపీ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా… విధాత‌: ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో బీఆర్ఎస్ తొలి బ‌హిరంగ స‌భ బుధ‌వారం జ‌రుగ‌నున్న‌ది. ఈ స‌భ‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం త‌ర్వాత రాష్ట్రంలో తొలిసారిగా నిర్వ‌హిస్తున్న స‌భ కావ‌డంతో ల‌క్ష‌లాది మందిని త‌ర‌లించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స‌భ‌కు ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌, కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌ల‌తో […]

  • By: krs    latest    Jan 17, 2023 6:25 PM IST
నేడు ఖ‌మ్మంలో BRS భారీ బ‌హిరంగ స‌భ‌
  • హాజ‌రు కానున్న ఢిల్లీ, కేర‌ళ సీఎంలు, యూపీ మాజీ సీఎం
  • పొంగులేటికి చెక్‌, ఏపీ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా…

విధాత‌: ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో బీఆర్ఎస్ తొలి బ‌హిరంగ స‌భ బుధ‌వారం జ‌రుగ‌నున్న‌ది. ఈ స‌భ‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం త‌ర్వాత రాష్ట్రంలో తొలిసారిగా నిర్వ‌హిస్తున్న స‌భ కావ‌డంతో ల‌క్ష‌లాది మందిని త‌ర‌లించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ స‌భ‌కు ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌, కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌ల‌తో పాటు ఉత్త‌రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్‌ను ఆహ్వానించారు. త‌మ ఆహ్వానం మేర‌కు వారు ఈ స‌భ‌కు వ‌స్తున్నార‌ని బీఆర్ఎస్ నేత‌లు తెలిపారు.

ఆంధ్ర ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దు జిల్లాలో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌డం ద్వారా ఏపీ రాజ‌కీయాల‌ను కూడా ప్ర‌భావితం చేయాల‌ని సీఎం కేసీఆర్ చూస్తున్నారు. అలాగే బీఆర్ ఎస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డికి కూడా చెక్ పెట్టాల‌ని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఈ స‌భ ద్వారా రెండు ర‌కాలుగా ల‌బ్ధి జ‌రుగుతుంద‌ని భావించి ఈ స‌భ నిర్వ‌హిస్తున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జ‌రుగుతుంది.

ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ రాజ‌కీయాల‌పై కేంద్రీక‌రించారు. ఇందుకు ఖ‌మ్మం జిల్లానే ఎంచుకున్నారు. ఆంధ్రా నుంచి జ‌న స‌మీక‌ర‌ణ చేసి మ‌రీ ఖ‌మ్మంలో స‌భ‌ను నిర్వ‌హించారు. కావాల‌ని తాను తెలంగాణ రాజ‌కీయాల‌లో జోక్యం చేసుకుంటున్నాన‌ని బాబు ఖ‌మ్మం స‌భ ద్వారా తెలియ‌జేశారు.

ఈ మేర‌కు తెలంగాణ టీడీపీకి అధ్య‌క్షుడిని ఎంపిక చేసి, కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నారు. ఖ‌మ్మం వేదికగా వివిధ పార్టీల‌లో చేరిన టీడీపీ నేత‌లంతా తిరిగి రావాల‌ని బాబు పిలుపునిచ్చారు. బాబు కావాల‌ని తెలంగాణ‌లో చేస్తున్న రాజ‌కీయం సీఎం కేసీఆర్‌కు ఆగ్ర‌హం క‌లిగించింది.

మ‌రో వైపు వైఎస్సార్ టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల కూడా ఖ‌మ్మం రాజ‌కీయాల‌పై ప‌ట్టు సాధించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. పాలేరు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంలో కార్యాల‌య నిర్మాణం కూడా చేప‌ట్టింది. ఇంకో వైపు పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి గ‌త కొంత కాలంగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్ కావాల‌నే ప‌క్క‌న పెట్టార‌న్న చ‌ర్చ కూడా గ‌త కొంత కాలంగా జ‌రుగుతున్న‌ది.

సీఎం కేసీఆర్ తీరు ప‌ట్ల తీవ్ర అసంతృప్తికి గురైన పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి బీజేపీలోకి వెళ్ల‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేర‌కు ఆయ‌న జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఆత్మీయ స‌భ‌లు కూడా నిర్వ‌హించారు. రాజ‌కీయ ప‌రిణామాల‌ను అతి జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించిన సీఎం కేసీఆర్ వ‌ల‌స‌ల‌కు చెక్ పెట్టాల‌ని భావించారు. ఈ మేర‌కు 2018 ఎన్నిక‌ల త‌ర్వాత తాను దూరం పెట్టిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును పిలిచి స‌భ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

సీఎం కేసీఆర్ తుమ్మ‌ల‌ను ద‌గ్గ‌ర‌కు తీయ‌డం ద్వారా జిల్లాలో వ‌ల‌స‌ల‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధ‌వారం ఖ‌మ్మం వేదిక‌గా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం కోసం భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌భ‌కు చుట్టు ప‌క్క‌ల జిల్లాల నుంచి భారీ ఎత్తున జ‌న స‌మీక‌ర‌ణ చేస్తున్నారు.