Khammam | తుమ్మల, పొంగులేటి, జలగం కలిస్తే! నివురు తొలగుతున్న నిప్పు

Khammam | గళమెత్తుతున్న అసంతృప్తి బీఆరెస్‌కు తుమ్మల గుడ్‌బై? తుమ్మల, పొంగులేటి, జలగం కలిస్తే ఉమ్మడి ఖమ్మంలో బీఆరెస్‌కు కష్టాలే ‘స్టేషన్‌’లో రాజయ్యదీ ధిక్కార కూత మెదక్‌ నుంచి మైనపల్లి కుమారుడు లెఫ్ట్‌ దూరంతో పలుచోట్ల బీఆరెస్‌కు గండి (విధాత ప్రతినిధి) బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అందరి కంటే ముందుగానే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు.. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరిగా గళం విప్పుతున్నారు. టికెట్లు రానివారు […]

  • Publish Date - August 26, 2023 / 12:05 AM IST

Khammam |

  • గళమెత్తుతున్న అసంతృప్తి
  • బీఆరెస్‌కు తుమ్మల గుడ్‌బై?
  • తుమ్మల, పొంగులేటి, జలగం కలిస్తే
  • ఉమ్మడి ఖమ్మంలో బీఆరెస్‌కు కష్టాలే
  • ‘స్టేషన్‌’లో రాజయ్యదీ ధిక్కార కూత
  • మెదక్‌ నుంచి మైనపల్లి కుమారుడు
  • లెఫ్ట్‌ దూరంతో పలుచోట్ల బీఆరెస్‌కు గండి

(విధాత ప్రతినిధి)

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అందరి కంటే ముందుగానే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు.. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరిగా గళం విప్పుతున్నారు. టికెట్లు రానివారు బాధ పడవద్దని భవిష్యత్తులో వారికి ఇతర అవకాశాలు ఉంటాయని సీఎం చెప్పారు. అయితే ఈ విషయంలో ఎవరికీ వ్యక్తిగతంగా స్పష్టమైన హామీలు లభించకపోవడం వారిని అనుమానాల్లోకి నెడుతున్నది. మౌనంగా ఉంటే అదే అంగీకారమవుతుందని భావించిన నేతలు మెల్లగా స్వరం పెంచారు. పాలేరు టికెట్‌ ఆశించిన తుమ్మల నాగేశ్వర్‌ రావు సుమారు వెయ్యి కార్లు, 2 వేల బైక్‌లతో ఆయన ఖమ్మం వెళ్లారు. ఆయనకు టికెట్‌ రాకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ మారి పాలేరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు.

కార్యకర్తలతో సమావేశం అనంతరం తుమ్మల వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని తేల్చారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసినట్టు చెప్పారు. నా జిల్లా కోసం, ఖమ్మం జిల్లా వాసుల రాజకీయ రుణం తీర్చుకోలేనిదన్నారు. గోదావరి జిల్లాలతో తన ప్రజల పాదాలు కడుగడానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. అయితే తుమ్మల మాటల బట్టి చూస్తే ఆయన పాలేరు నుంచి కాకుండా ఖమ్మం నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పాటు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.

జిల్లా మంత్రిగా అందరినీ సమన్వయం చేయాల్సిన అజయ్‌కుమార్‌ పార్టీలో తమ వర్గాన్ని ఇబ్బంది పెట్టారని, తమకు అన్యాయం చేశారని గతంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. తుమ్మల కూడా నేరుగా మంత్రిపై ఆరోపణలు చేయకున్నా ఖమ్మం నుంచే పోటీ చేసి ఆయనను ఓడించాలనే కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన గతంలో జిల్లా టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశమయ్యారు. ఆ సందర్భంలో వారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తుమ్మలను గెలిపించుకుంటామని శపథం చేసిన సంగతి తెలిసిందే.

షర్మిల వల్లే తుమ్మల ఖమ్మం నుంచి!

షర్మిల పార్టీ కూడా కాంగ్రెస్‌లో విలీనమౌతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఒకవేళ అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకున్నా.. రెండు పార్టీల మధ్య అవగాహన కుదరవచ్చని కలిసి పోటీ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించడంతో తుమ్మలకు ఖమ్మం నియోజకవర్గాన్ని ఆఫర్‌ చేసి ఉండొచ్చని చెబుతున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని సవాల్‌ విసిరిన పొంగులేటి పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాలను కాంగ్రెస్‌ ఖాతాలో వేయించేందుకు కృషి చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వర్‌రావు, జలగం వెంకటరావులను పార్టీలోకి తీసుకొస్తే మెజారిటీ అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీటును కూడా గెలుచుకోవచ్చనే యోచనలో ఉన్నారు. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నది.

రాజయ్యదీ ధిక్కారమే

స్టేషన్‌ ఘన్‌పూర్‌లోనూ బరిలో ఉంటానని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. ఆరునూరైనా రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోనే ఉంటానని, భూమి కొని దుక్కిదున్ని, నారు నీరు పోసి, రాశి చేస్తే.. ఎవరో వచ్చి దానిపై కూర్చుకుంటానంటే ఊరుకుంటానా? అని పరోక్షంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన కూడా పార్టీ మారొచ్చు అంటున్నారు. టికెట్లు రాని వారిని బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్‌ కమిటీ వేసినా ఫలితం కనిపించడం లేదు.

మెదక్‌ నుంచి మైనపల్లి కుమారుడు

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్‌ నుంచి తన తనయుడిని పోటీ చేయించడానికే మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ తనపై వేటు వేసినా అందుకు సిద్ధంగా ఉన్నట్టున్నారు. అట్లనే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌లతో, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలతో పాటు రామగుండంలో కందుల సంధ్యారాణి లతో పాటు టికెట్లు ఆశించి భంగ పడిన వారు రానున్నరోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వాళ్లంతా తిరుగుబాటు జెండా ఎగురవేస్తే అధికారపార్టీకి 15-20 స్థానాల్లో సొంతపార్టీ నేతల నుంచే ముప్పు తప్పేలా లేదంటున్నారు.

మరోవైపు వామపక్షాలతో చిక్కు

వామపక్షాలు కూడా తాము బలంగా ఉన్నచోట బరిలో ఉంటామన్నారు. హుస్నాబాద్‌తో పాటు తమకు పట్టున్న ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. సీపీఎం కూడా మిర్యాలగూడ, మునుగోడుతో పాటు ఖమ్మం జిల్లాలో పోటీ చేయవచ్చు. తమ బలాన్ని తక్కువ అంచనా వేసిన బీఆర్‌ఎస్‌ అధినేతకు తమ సత్తా ఏమిటో చూపెడుతామని వామపక్ష నేతలు ఇప్పటికే చెప్పారు.

దీంతో ఏడెనిమిది నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు గండిపడే ప్రమాదం ఉన్నది. అక్టోబర్‌ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ రావొచ్చు. ఆ లోగా అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీకీ వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీతో కమ్యూనిస్టులు, ఇతర చిన్న పార్టీలు అవగాహనకు రావొచ్చు. కలిసి పోటీ చేయవచ్చు. అదే జరిగితే బీఆర్‌ఎస్‌కు డేంజర్‌ బెల్స్‌ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.

Latest News