Khammam | తెలంగాణ గర్జన సాక్షిగా BRSను బొందపెడతాం: రేవంత్‌రెడ్డి
Khammam నాలుగు నెలలుగా పొంగులేటితో టచ్‌లో ఉన్నాం ఆర్టీసీ బస్సులు అద్దెకివ్వకుండా అడ్డుకున్నారు అయినా బీఆర్ ఎస్ సభను మించి జనమొస్తరు ఖమ్మం, విధాత ప్రతినిధి: నాలుగైదు నెలలుగా పొంగులేటితో చర్చలు జరిపామని, తనకు కష్టమైనా, నష్టమైనా అభిమానుల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి నిర్ణయం తీసుకున్నారని టీపీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. జూలై రెండున ఖమ్మం సభ వేదికగా సమరశంఖం పూరించాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రేవంత్‌రెడ్డి […]

Khammam
- నాలుగు నెలలుగా పొంగులేటితో టచ్‌లో ఉన్నాం
- ఆర్టీసీ బస్సులు అద్దెకివ్వకుండా అడ్డుకున్నారు
- అయినా బీఆర్ ఎస్ సభను మించి జనమొస్తరు
ఖమ్మం, విధాత ప్రతినిధి: నాలుగైదు నెలలుగా పొంగులేటితో చర్చలు జరిపామని, తనకు కష్టమైనా, నష్టమైనా అభిమానుల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి నిర్ణయం తీసుకున్నారని టీపీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. జూలై రెండున ఖమ్మం సభ వేదికగా సమరశంఖం పూరించాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రేవంత్‌రెడ్డి ఖమ్మంకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న రాక్షసుడు
నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తన వంతు సాయంగా ఉండేందుకు 1500 బస్సులు సభ కోసం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని రేవంత్ తెలిపారు. కానీ ఒంటికన్ను శివరాసనుడు బస్సులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. “బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా… ఏదీ లేకపోతే నడుచుకుంటూనైనా ఇక్కడి ప్రజలు సభకు వస్తారని చెప్పారు. మీరు అడ్డుగోడలు కడితే దూకి వస్తారు…. మీరే అడ్డు వస్తే తొక్కుకుంటూ వస్తారు.
సీఎం కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా.. బీఆరెస్ సభ కంటే ఎక్కువ మంది సభలో కదం తొక్కుతారు. కావాలంటే లెక్క కట్టుకో కేసీఆర్.. ఖమ్మం సభతో బీఆర్ ఎస్ పాలనకు సమాధి కడుతాం. మా సీనన్న మూడో కన్నులాంటివాడు.. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో… బీఆరెస్ పరిస్థితి కూడా అంతే..” అంటూ సవాల్ విసిరారు.
పార్టీలో పాత, కొత్త లేకుండా కలిసి ముందుకు సాగుతాం
కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగుతామని రేవంత్ తెలిపారు. “ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలిపించండి… రాష్ట్రంలో 80కి పైగా సీట్లు గెలిపించే బాధ్యత మాది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించి సోనియా గాంధీకి జన్మదిన కానుక ఇద్దాం.. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదు.. బంగాళాఖాతంలో కలిపేస్తాం” అన్నారు.
కాంగ్రెస్ వల్లే పోడుపట్టాల పంపిణీ
కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్లనే కేసీఆర్ గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తున్నారని, ఖమ్మంలో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ఈ నిర్ణయం తీసుకున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయానికి రాని కేసీఆర్ ను ప్రజల బాట పట్టించామన్నారు. ఎలక్షన్ శాంపిల్ కోసమే కేసీఆర్ పోడు పట్టాలు ఇస్తుండని,
అసలు ఈ ప్రభుత్వమే శాంపిల్ ప్రభుత్వమని దుయ్యబట్టారు.
టికెట్లు ఇవ్వనందుకే పొంగులేటి కాంగ్రెస్‌లోకి పోయినట్లు కేటీఆర్ చెబుతున్నారని, ఆనాడు చంద్రబాబు పదవి ఇవ్వనందుకే మీ అయ్య టిడిపిని వీడిన విషయం మర్చిపోయారా అని గుర్తు చేశారు. తెలంగాణ జన గర్జన సభ సాక్షిగా బీఆర్ ఎస్ ను బొంద పెట్టడం ఖాయమన్నారు.