రెండో వారంలో.. బీజేపీ అభ్యర్థుల జాబితా: కిషన్‌రెడ్డి

- స్పీడు పెంచిన రాజకీయ పార్టీలు
విధాత, హైదరాబాద్: తెలంగాణలో అంసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి. అభ్యర్థుల కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆరెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం సైతం ప్రారంభించింది. అయితే తాజాగా బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో పడింది.
ఈనెల రెండో వారంలో జాబితాను ప్రకటించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. దశల వారిగా జాబితాను ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ఈ నెల 5, 6 తేదీల్లో జరగబోయే పార్టీ సమావేశాలకు జాతీయ నేతలు హాజరవుతున్నట్లు తెలిపారు.
కాగా.. 6వ తేదీన జరిగే సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేస్తారన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల విషయంలో ఇప్పటికే పలు సర్వేలు, కమిటీలు నిర్వహించింది. జాబితాను అధిష్టానానికి పంపారు. త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.