రెంటికీ చెడ్డ రేవడి కోటంరెడ్డి.. TDP నుంచి పిలుపు లేనట్టేనా..!

విధాత‌: ఏదో చేద్దాం.. ఏదో అవుదాం అనుకుని ఎటూ కాకుండా పోయారా. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నారా.. ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడి అయ్యారా. పాపం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ బాట చిక్కుల్లో పడిందా. చూస్తుంటే అలాగే ఉంది. వైఎస్ జగన్‌కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ మధ్య పార్టీమీద, పార్టీ ప్రముఖుల మీద హాట్ హాట్ కామెంట్స్ చేసి పార్టీ నుంచి బయటకు […]

  • Publish Date - February 17, 2023 / 01:05 PM IST

విధాత‌: ఏదో చేద్దాం.. ఏదో అవుదాం అనుకుని ఎటూ కాకుండా పోయారా. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నారా.. ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడి అయ్యారా. పాపం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ బాట చిక్కుల్లో పడిందా. చూస్తుంటే అలాగే ఉంది.

వైఎస్ జగన్‌కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ మధ్య పార్టీమీద, పార్టీ ప్రముఖుల మీద హాట్ హాట్ కామెంట్స్ చేసి పార్టీ నుంచి బయటకు వెళ్లారు. ఆయనను ఇలా తప్పించి, వెనువెంటనే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డిని నెల్లూరు రూరల్ ఇంచార్జ్‌గా పార్టీ నియమించింది. ఆయన తనపని తాను చేసుకుపోతున్నారు.

ఇక కోటంరెడ్డి శ్రీధర్ అయితే.. తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని ఉంది అని చెప్పేశారు. సరే ఈయన చెప్పేస్తే సరిపోదు కదా. అటు టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో స్పందన ఉండాలి కదా. కానీ అదే ఇక్కడ లేకుండా పోయింది.

ఎన్నడూ లేనిది జగన్ను విమర్శించారు. సజ్జల వంటి సీనియర్లను నిందించారు. ఆయినా కోటం రెడ్డిని టీడీపీ నాయకులు రిసీవ్ చేసుకోవడం లేదు. అసలు ఆయన్ను టీడీపీలోకి రానిస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం కోటం రెడ్డిని అసలు రానీయకూడదనే భావిస్తున్నారు అంటున్నారు.

ఆయన ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిస్తే మంత్రి పదవిని కోరుకుంటున్నారు. గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన సోమిరెడ్డి మరోసారి పదవి కోసం చూస్తున్నారు. కోటం రెడ్డి వస్తే కనుక ఆయనకు పోటీ అవుతుంది అని భయపడుతున్నారని అంటున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు కోటం రెడ్డి మీద అధినాయకత్వానికి ఫిర్యాదులు చేశారని, ఆయనను తీసుకోవద్దని కోరారని అంటున్నారు.

అంతే కాకుండా జిల్లాలోని పలువురు టీడీపీ నాయకులు కూడా శ్రీధర్ రెడ్డిని అడ్డుకుంటున్నారని సమాచారం. కేవలం చంద్రబాబును నమ్ముకున్న కోటంరెడ్డి చివరకు ఎలా.. ఏమవుతారు.. టీడీపీ ఆదరిస్తుందా.. ఇంకా ఇప్పటికి అయితే క్లారిటీ లేదు.