కృష్ణా జలాలే అస్త్రంగా బీఆరెస్ రాజకీయం

బీఆరెస్ నాయకత్వం కృష్ణా ప్రాజెక్టులపై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించడాన్ని తమ రాజకీయ పోరాట అస్త్రంగా మలుచుకుంంది.

కృష్ణా జలాలే అస్త్రంగా బీఆరెస్ రాజకీయం
  • కృష్ణా జలాలే అస్త్రంగా బీఆరెస్ రాజకీయం
  • కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ
  • పార్లమెంటులో గళమెత్తనున్న ఎంపీలు

విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ముంచుకొంచిన లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి జనాదరణ సాధించేందుకు మళ్లీ సెంటిమెంట్ నినాదాలనే ఆశ్రయిస్తున్న బీఆరెస్ నాయకత్వం కృష్ణా ప్రాజెక్టులపై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించడాన్ని తమ రాజకీయ పోరాట అస్త్రంగా మలుచుకుంంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే కృష్ణా నదిపై ఉన్న రెండు పెద్ద ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగించాలని నిర్ణయించగా, ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్న బీఆరెస్ అది తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం కల్గిస్తుందన్న వాదనను వినిపిస్తున్నది.


ఇక నుంచి తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తికి చుక్కనీరు తీసుకోవాలన్న బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, తెలంగాణ ప్రయోజనాలను, హక్కులనుల కేంద్రం ఏపీ చేతిలో పెట్టడమేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు అంటూ బీఆరెస్ ప్రశ్నిస్తుంది. ఇదే అంశాన్ని లోక్‌సభ ఎన్నికల వేళ తమ రాజకీయ అస్త్రంగా సంధించాలన్న బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో తమ కార్యాచరణ ప్రారంభించారు.

  • ఢిల్లీలో నిరసన

కృష్ణా నదిపై ఉన్న రెండు కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆరెస్‌ ఎంపీలు శుక్రవారం పార్లమెంటు వెలుపల తమ నిరసన తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసిన ఎంపీల బృందం తమకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖను అందజేశారు. ప్రాజెక్టులను బోర్డు అప్పగించే నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని.. వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు, కృష్ణా ట్రైబ్యునల్లో విచారణ పూర్తయ్యేవరకు ఇరు రాష్ట్రాలకు 50:50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ అంశంపై తమ అభ్యంతరాలను పార్లమెంటులో వినిపిస్తామని ప్రకటించారు.