కాంగ్రెస్‌తోనే మాకు పోటీ, బీజేపీ ఒక్క సీటు గెలువదు: కేటీఆర్
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తమకు పోటీ ఉంటుందని, భారతీయ జనతా పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలవడం కష్టమని కేటీఆర్ స్పష్టం చేశారు

- రాహుల్ ఒక అజ్ఞాని
- రేసులో లేని బీజేపీ
- నిజామాబాద్, కరీంనగర్‌లలో ఓట్లు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నబీజేపీ, కాంగ్రెస్ లు
- కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకుడు లేడు
- 40 నియోజక వర్గాలలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరు
- వామపక్షాలతో చర్చలు జరిపాం కానీ లెక్కలు కుదరలే
- ప్రగతి భవన్‌లో మీడియాతో ఇష్ఠాగోష్ఠిలో బీఅరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్
విధాత: రాష్ట్రంలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తమకు పోటీ ఉంటుందని, భారతీయ జనతా పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలవడం కష్టమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన ప్రగతి భవన్‌లో మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నారని, గజ్వేల్ నియోజకవర్గంలో కూడా సిఎం కె.చంద్రశేఖర్ రావు చేతిలో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. బిజెపిలో అభ్యర్థుల కొరత కారణంగా 119 నియోజకవర్గాల్లో ఈటల రాజేందర్ పోటీ చేస్తారేమోనని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ లో బుజ్జగింపుల కమిటీకి మాజీ మంత్రి కె.జానారెడ్డి చైర్మన్ అయినట్లు, బిజెపిలో రాజేందర్ పరిస్థితి అలానే ఉందన్నారు. నిజామాబాద్, కరీంనగర్ లో బిజెపి, కాంగ్రెస్ లు ఓట్లు ట్రాన్స్‌పర్ చేసుకోలేదా అని ప్రశ్నించారు. మా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు అవుతుంది, 95 శాతం మందికి బి ఫారాలు కూడా ఇచ్చేశాం అన్నారు. ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధిస్తామని, కెసిఆర్ కు ప్రత్యామ్నాయ నాయకుడు లేరని, 40 నియోజకవర్గాలలో కాంగ్రెస్ కు అభ్యర్థులు లభించడం లేదన్నారు. ఎన్నికలకు ముందే బిజెపి చేతులెత్తేసిందని, అసలు రేసులోనే లేదన్నారు. ఆ పార్టీకి 110 నియోజకవర్గాలలో డిపాజిట్ దక్కదన్నారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా ఇప్పటి దాకా 1.40 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 90వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు బిజెపి ఎంపి బండి సంజయ్, పిసిసి ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి, బిఎస్‌పి అధ్యడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ లు కోర్టులను ఆశ్రయించారన్నారు. వరంగల్ కు చెందిన ప్రవళ్లిక ఆత్మహత్యను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తే, మేము మానవీయ కోణంలో ఆ కుటుంబాన్ని ఆదుకున్నామన్నారు.
రాహుల్ అజ్ఞాని
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఒక అజ్ఞాని అని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు ఏమీ తెలియదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోందని చెబుతున్నాడని, కాంగ్రెస్ హయాంలో ఇసుక మాఫియా రాజ్యమేలిందని తెలియదా అని ప్రశ్నించారు. గల్లి నుంచి ఢిల్లీ వరకు సూట్ కేసులు మోసే సంస్కృతి కాంగ్రెస్ లోనే ఉందని, మాఫియాలు, కుంభకోణాల సంస్కృతి కాంగ్రెస్ కే చెల్లుతుందన్నారు. తెలంగాణకు మళ్లీ వచ్చినప్పుడు కనీసం తెలుసుకుని రాహుల్ మాట్లాడితే బాగుంటుందన్నారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ను తుంగలోకి తొక్కిన కాంగ్రెస్‌కు, రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను చెత్తబుట్టలో వేయదనే గ్యారంటీ ఉందా అని కెటిఆర్ అడిగారు. రాహుల్ లీడర్ కాదని, రీడర్ అని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం కావొచ్చని, ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పదన్నారు. బిజెపి ప్రభుత్వం మా మెడపై కత్తి పెట్టి ఇబ్బందులకు గురి చేసిందన్నారు. కర్ణాటకలో కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అక్కడి మంత్రే స్వయంగా తనతో చెప్పారన్నారు.
ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్‌దే
55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 7,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, బిఆర్ఎస్ పాలనలో కరెంటు ఉత్పత్తి మిగులు రాష్ట్రంగా మార్చామన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్ దని, విద్య, వైద్యం, సంక్షేమంలో తమకు ఎవరూ పోటీ లేరన్నారు. ఫ్లోరోసిస్ కాంగ్రెస్ ఇస్తే దాన్ని మేము రూపుమాపామన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని, మాకు వ్యవసాయంలో సుద్దులు చెప్తే హాస్యాస్పదంగా ఉంటుందన్నారు. ముస్లిం మైనారిటీ సంక్షేమంలో దేశంలోనే టాప్ లో ఉన్నామన్నారు. రైతు బంధు, దళిత బంధు పథకాలు ఏ రాష్ట్రంలో లేవని అన్నారు. హైదరాబాద్ నగరంలో రోడ్డు షోలు ఉంటాయన్నారు.
ఖమ్మంలో నాయకులు వెళ్లారు.. సీట్లు పెరుగుతాయి
గతంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో తమ పార్టీలో నాయకులు ఎక్కువగా ఉన్నారని, అయినా సీట్లు తక్కువ వచ్చాయని కేటీఆర్ అన్నారు. ఆ నాయకులు కాంగ్రెస్ కు వెళ్లిపోవడం మూలంగా ఈసారి సీట్లు మాకు పెరుగుతాయన్నారు. ఖమ్మంలో నాయకులు కాదు, పార్టీ ముఖ్యమన్నారు. నల్లగొండ జిల్లాలో కూడా 12 స్థానాలకు పన్నెండు గెలుస్తుమని ధీమా వ్యక్తం చేశారు. మంథని, రామగుండంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులతో పోటీ ఎక్కువగా ఉంటుందన్నారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ లో అసంతృప్తి సద్దుమణిగిందన్నారు. ఖానాపూర్, బోధ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడారని, ఉద్యమకారులు మళ్లీ మా పార్టీలోకి వస్తున్నారన్నారు. ఉద్యమకారుల చేరికతో నకిరేకల్, ఆలేరులో తమ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. పార్టీ వీడిన ఉద్యమకారులను మళ్లీ మాట్లాడి వెనక్కి పిలిపిస్తున్నామని, చాలా మంది చేరుతున్నారన్నారు. సీట్ల విషయంపై వామపక్ష పార్టీలతో చర్చలు జరిపాం కాని లెక్కలు తేలకపోవడంతో పొత్తు కుదరలేదన్నారు.
మా నేతలపై వ్యతిరేకత లేదు
మహారాష్ట్రలో శివసేన హిందూ పార్టీగా ప్రకటించుకోగా, తెలంగాణలో ఎంఐఎం ముస్లిం పార్టీగా ప్రకటించుకున్నదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎంఐఎం మాకు ఫ్రెండ్లి పార్టీ అని అన్నారు. మేము ఎవరికీ బి, సి టీమ్ కాదని, లుచ్చా టీమ్, ఏ టూ జెడ్ కరఫ్షన్ పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బిజెపిని బూచీగా చూపించి మైనారిటీ ఓట్లను కాంగ్రెస్ వేయించుకుంటున్నది నిజం కాదా అన్నారు.కెసిఆర్ ప్రభుత్వ పనితీరు విమర్శించడానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎవరు సరిపోరన్నారు.
సర్వే రిపోర్టులు చూసి ఆగం కావద్దని, మా సర్వే ప్రకారం అంతా బాగుందన్నారు. మా నాయకుల మీదా ఎక్కడా వ్యతిరేకత లేదని అన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి అభ్యర్థులను ప్రకటించామని తెలిపారు. 2018లో కూడా ఇదే విధంగా చెప్పినా, ఘన విజయం సాధించామన్నారు.
ఇసుకపై నేడు రూ. 5 వేల కోట్ల ఆదాయం
తెలంగాణ ఏర్పడక ముందు ఇసుక మీద రూ.30 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుతం రూ.5వేల కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు. మెడికల్ కాలేజీలు మూడే ఉండగా, 33 కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. నత్తలు సిగ్గుపడేలా సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ కట్టిందన్నారు.