రేవంతే మరో ఏక్‌నాథ్‌ షిండే

రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి మరో ఏక్‌నాథ్‌ షిండే, మరో హేమంత్‌ బిశ్వశర్మలా తయారవుతారని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు

రేవంతే మరో ఏక్‌నాథ్‌ షిండే
  • లోక్‌సభ ఎన్నికల తర్వాత ఫిరాయింపు
  • కాంగ్రెస్‌ను ముంచే పనిలో రేవంత్‌రెడ్డి
  • ఆయనకు ఆ పార్టీ నుంచే ఇబ్బందులు
  • ఆ ఫ్రస్టేషన్‌లోనే నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు
  • మళ్లీ కరీంనగర్‌ నుంచే కేసీఆర్‌ జంగ్‌సైరన్‌
  • రేవంత్‌ సీఎంగా ఉంటేనే కేసీఆర్‌ విలువ తెలిసేది
  • కరీంనగర్‌ సభలో మాజీ మంత్రి కేటీఆర్‌

కరీంనగర్‌ : రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి మరో ఏక్‌నాథ్‌ షిండే, మరో హేమంత్‌ బిశ్వశర్మలా తయారవుతారని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎమ్మెల్యేలను తీసుకునిపోయి బీజేపీలో కలుస్తాడని చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను ముంచే పనిలో ఉన్నాడని అన్నారు. మోదీని బడే భాయ్‌ అని ఎలా అంటారని నిలదీశారు. తెలంగాణ మోడల్‌ను కించపరుస్తూ.. గుజరాత్‌ మోడల్‌ అని రేవంత్‌ అనడాన్ని కేటీఆర్‌ తప్పుపట్టారు.


గురువారం కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. అబద్ధాల రేవంత్‌రెడ్డి పాలనపై మళ్లీ కరీంనగర్‌ నుంచే పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జంగ్‌సైరన్‌ మోగించనున్నారని చెప్పారు. అధికారంలో‌ ఉండి రేవంత్ రెడ్డి ప్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను జేబులో కత్తెర్లు పెట్టుకుని తిరుగుతున్నానన్న రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. జేబు దొంగలే జేబుల కత్తెర్లు పెట్టుకుని తిరుగుతారని అన్నారు. తీవ్ర ఫ్రస్టేషన్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి స్థాయి నుంచి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్‌ సీఎంగా ఉంటేనే.. ప్రజలకు కేసీఆర్‌ విలువ తెలుస్తుంది

ఐదేండ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న కేటీఆర్‌.. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే కేసీఆర్‌ విలువ ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్న పెద్ద మనుషులతోనే రేవంత్‌రెడ్డికి ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. తాము మోసపోయి కాంగ్రెస్‌కు ఓట్లు వేశామని రైతు బాధపడుతున్నారని కేటీఆర్‌ చెప్పుకొన్నారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినా ఇప్పటికీ రైతుబంధు ఇచ్చే ముఖం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ రుణమాఫీ కాలేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. మగాడివైతే మల్కాజిగిరి రావాలని, అక్కడ ఇద్దరం పోటీచేద్దామని కేటీఆర్‌ సవాలు విసిరారు. అధికారంలోకి వచ్చిన తొంభై ‌రోజులలోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభిమానాన్ని కోల్పోయాడని అన్నారు.

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

రాష్ట్రంలో కొనసాగుతున్న కరువు పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ తెచ్చిన కరువని కేటీఆర్‌ విమర్శించారు. లిఫ్టు ఇరిగేషన్లలోనే కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టని అభివర్ణించారు. మేడిగడ్డకు ఉన్న 85 పిల్లర్లలో మూడు పిల్లర్లు కుంగితే దిద్దుబాటు చర్యలు చేయరా? అని నిలదీశారు. కరువు రావొద్దని కట్టిన బ్రహ్మాండమైన ప్రాజెక్టే కాళేశ్వరమని చెప్పారు. ‘సన్నాసి రేవంత్‌రెడ్డికి మేడిగడ్డ తెల్వదు, కాళేశ్వరం తెలువదు. ఎవడో రాసిన స్క్రిప్టు చదువుతుండు’ అని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో గొంతెండే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిసిన బండి

‘బండి సంజయ్ అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిసిండు. అయన ఏం మాట్లాడుతారో అయనకే తెలువదు’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో కరీంనగర్ కమాన్ వద్ద చర్చకు రావాలని బండి సంజయ్‌కు కేటీఆర్‌ సవాలు విసిరారు. సైకోలాగా ఒర్రడమే సంజయ్‌ పని అని, అలాంటి వ్యక్తికి ఓట్లెందుకు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్‌కు పనికి వచ్చే ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. శివలింగం మీద తేలులాగ బండి సంజయ్ తయ్యారయ్యాడని అన్నారు. మంత్రి పొన్నం ‌ప్రభాకర్‌ను తల్లికి పుట్టినవా అడిగడం కరెక్టేనా? అని నిలదీశారు. ఎంపీ నిధులు కూడా ఖర్చు చేయని వ్యక్తి అని దుయ్యబట్టారు. ధర్మం కోసం పనిచేస్తే బండి సంజయ్ మఠం పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.