KTR | అదో సన్నాసుల పార్టీ.. అంతా చేతగాని వెధవలే

సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొద‌లుపెడితే సిరిసిల్ల‌లో ఉన్న మ‌హేంద‌ర్ రెడ్డి వ‌ర‌కు అంద‌రూ ద‌గుల్బాజీలు, స‌న్నాసులు, చేత‌కాని వెధ‌వ‌లేననిని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు

  • By: Somu    latest    Mar 05, 2024 11:20 AM IST
KTR | అదో సన్నాసుల పార్టీ.. అంతా చేతగాని వెధవలే
  • రాజకీయ కక్షతో గత ప్రభుత్వం చేపట్టిన పనులను రద్దు చేస్తున్నారు
  • మేం ఇచ్చిన ఉద్యోగాలతో కాంగ్రెస్ ప్రచారం
  • కాంగ్రెస్ నేతలపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్‌
  • 12న కరీంనగర్‌లో కదన భేరీ బహిరంగ సభ


విధాత, హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొద‌లుపెడితే సిరిసిల్ల‌లో ఉన్న మ‌హేంద‌ర్ రెడ్డి వ‌ర‌కు అంద‌రూ ద‌గుల్బాజీలు, స‌న్నాసులు, చేత‌కాని వెధ‌వ‌లేననిని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలోని ముస్తాబాద్ మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట‌రీ స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. నియోజ‌క‌వ‌ర్గంలో మంజూరైన రూ. 14 కోట్ల రోడ్డు ర‌ద్దు చేయ‌డం కాదని, నీకు ద‌మ్ముంటే, చేత‌నైతే ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకోవాలని కేకే మహేందర్‌రెడ్డిని సవాల్ చేశారు.


దుబ్బాక నుంచి ముస్తాబాద్ వ‌ర‌కు తాను రెండు లేన్ల రోడ్డు మంజూరు చేశానని, నీకు చేత‌నైతే ఆ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా మార్చి ప్ర‌జ‌ల మ‌న‌సును గెలుచుకోవాలని హితవు పలికారు. త‌న మీద కోపంతో బ‌తుక‌మ్మ చీర‌ల ఆర్డ‌ర్లు ర‌ద్దు చేసి, సిరిసిల్ల నేత‌న్న‌ల కొంప ముంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మీద కోపంతో చిల్ల‌ర రాజ‌కీయం కోసం కాళేశ్వ‌రం వేస్ట్ అంటున్నారని, రైతుల‌కు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్‌ను బ‌ద్నాం చేయాల‌నే ఉద్దేశంతో కాంగ్రెస్‌ దివాళా, ద‌గుల్బాజీ రాజ‌కీయం చేస్తోందని దుయ్యబట్టారు.


కేసుల‌కు, జైళ్ల‌కు భ‌య‌ప‌డేది లేదని, ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతూనే ఉంటామ‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత అన్ని ప‌నుల‌ను ర‌ద్దు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలని, రైతుల‌కు రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయ‌లేదు.. రైతుబంధు వేయ‌లేదన్నారు. ఎల్ఆర్ఎస్‌పై రేపు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలు చేయాలని పిలుపునిచ్చామన్నారు. మంది పిల్లలను నా పిల్లలే అన్నట్లుగా బీఆరెస్‌ ఇచ్చిన ఉద్యోగాల‌పై కాంగ్రెస్ ప్ర‌చారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. డిసెంబ‌ర్ 9న అన్ని హామీలు నెర‌వేరుస్తామ‌ని రేవంత్ మాట త‌ప్పారని విమర్శించారు.


అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై మొత్తంగా బీఆరెస్‌ కేవ‌లం 4 ల‌క్ష‌ల ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని గుర్తు చేశారు. క‌రీంన‌గ‌ర్‌కు బండి సంజ‌య్ చేసిందేమీ లేదని, మ‌తం పేరుతో ఓట్లు అడ‌గ‌డం త‌ప్ప సంజ‌య్ చేసిందేమీ లేదని, ఇప్పుడు అయోధ్య పేరు మీద ఓట్లు దండుకోవాల‌ని బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈనెల 12న కరీంనగర్‌లో బీఆరెస్ నిర్వహించనున్న కదన భేరీ బహిరంగ సభతో పార్లమెంటు ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించబోతున్నామన్నారు.