స్థానిక సంస్థల ఎమ్మెల్సీ..పార్లమెంటు సీట్లు గెలవాలి
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతో పాటు మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాల్లో బీఆరెస్ విజయం కోసం పార్టీ నేతలు కృషి చేయాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిర్ధేశించారు

- పార్టీ నేతలకు కేటీఆర్ నిర్ధేశం
విధాత, హైదరాబాద్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతో పాటు మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాల్లో బీఆరెస్ విజయం కోసం పార్టీ నేతలు కృషి చేయాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిర్ధేశించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆరెస్ ముఖ్య నాయకులతో కేటీఆర్ భేటీ అయ్యారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమం కావడం.. ఈనెల 11న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో అభ్యర్థి ఎంపికపై చర్చించారు.
ఒకటి రెండు రోజుల్లోనే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికతో పాటు మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పైన పార్టీ అధినేత కేసీఆర్ ఒక విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ రోజు భేటీలో ఎమ్మెల్సీతో పాటు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి చర్చించిన అంశాలను కేసీఆర్‌కు వివరిస్తామని తెలిపారు. కాగా ఎమ్మెల్సీతో పాటు లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పరిస్ధితులను తాము కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తామని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఈ రెండు లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు బలంగా ఉన్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.