అమెరికాలో.. 183 ఎకరాల్లో హిందూ దేవాలయం

- పుష్కరకాలంగా నిర్మాణ పనులు
- వచ్చే నెల 8న గుడి ప్రారంభోత్సవం
విధాత: అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయం వచ్చేనెలలో ప్రారంభం కానున్నది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆలయంగా ఖ్యాతిగాంచనున్నది. న్యూజెర్సీలోని టైమ్స్ స్క్వేర్‌కు దక్షిణంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్ అక్షరధామ్‌ను అక్టోబర్ 8న లాంఛనంగా ప్రారంభించనున్నారు. 183 ఎకరాల్లో తలపెట్టిన ఆలయ నిర్మాణానికి సుమారు పుష్కరకాలం (12 సంవత్సరాలు) పట్టింది. ఆలయ నిర్మాణంలో అమెరికా వ్యాప్తంగా 12,500 మంది వలంటీర్లు పాలుపంచుకున్నారు.
కంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్‌లో 500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆలయం ప్రపంచంలోనే అతి పెద్దది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అది ఖ్యాతి గడించింది. న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో నిర్మించిన ఈ అక్షరధామ్ ఆలయం రెండవ అతిపెద్దది. ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయం 100 ఎకరాల్లో విస్తరించి ఉన్నది.
అమెరికాలోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయం ప్రాచీన భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించారు. ఆలయంలో 10,000 పైగా విగ్రహాలు, భారతీయ సంగీత వాయిద్యాలు, నృత్య రూపాల శిల్పాలు ఉన్నాయి. ప్రధాన మందిరంతోపాటు, ఈ ఆలయంలో 12 ఉప మందిరాలు, తొమ్మిది గోపురాలు, తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి.
సున్నపురాయి, గ్రానైట్, గులాబీ ఇసుకరాయి, పాలరాయి సహా దాదాపు రెండు మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. వీటిని భారతదేశం, టర్కీ, గ్రీస్, ఇటలీ, చైనాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. ఆలయం వద్ద బ్రహ్మకుండ్స్ అనే సంప్రదాయ భారతీయ మెట్ల బావి నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 నదుల నుంచి నీటిని తీసుకొచ్చి ఇందులో కలిపారు.