ఎవరు.. ఎవరి టీం?

ఎవరు.. ఎవరి టీం?

– ఏ టీం.. బీ టీం.. సీ టీం..

– త్రిముఖ పోరులో ఇద్దరు మిత్రులెవరో!

– బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం ఒక్కటేనన్న కాంగ్రెస్‌

– కాంగ్రెస్‌కు బీఆరెస్‌ బీ టీం అన్న బీజేపీ

– ఢిల్లీ పార్టీలన్నీ ఒక్కటేనంటున్న బీఆరెస్‌

– బీఆరెస్‌కు సీ టీమ్‌గా తెరపైకి సీపీఎం!

విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాల్లో భాగంగా ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న ప్రచార యుద్ధం ముందెన్నడూ లేని రీతిలో ప్రజలను గందరగోళంలో పడేసేలా సాగుతున్నది. ఎవరికి వారే ప్రత్యర్థి పార్టీలను బీ, సీ టీంలుగా అభివర్ణిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు సైతం ఇతర పార్టీలను మరో పార్టీకి బీ టీం అని ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నకల బరిలో మూడు పార్టీలు తలపడుతున్న వేళ.. ప్రతి ఒక్క పార్టీ మిగిలిన రెండు పార్టీలను బీటీం అని అభివర్ణిస్తున్న తీరే విచిత్రంగా తయారైంది. బీజేపీకి బీఆరెస్‌ బీ టీం లా వ్యవహరిస్తున్నదని, ఎంఐఎం సీ టీంలా తయారైందని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది. బీఆరెస్‌ గతంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికిన సందర్భాలను తేదీలతో సహా వివరిస్తున్నది.

రేపు ఎన్నికలయ్యాక మెజార్టీ రాకపోతే.. బీజేపీ మద్దతుతోనే బీఆరెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తుందని మండిపడుతున్నది. మరోవైపు బీఆరెస్‌కు కాంగ్రెస్‌ బీటీం లా మారిందని బీజేపీ విమర్శిస్తున్నది. ఎంఐఎంను బీఆరెస్‌ సీ టీం అని ఆరోపిస్తున్నది. ఎన్నికలయ్యాక ఆ రెండు పార్టీలే కలుస్తాయని చెబుతున్నది. ఇక బీఆరెస్ మాత్రం తాము ప్రజల టీం అంటూనే తెలంగాణను మోసం చేయడంలో ఢిల్లీ పార్టీలు రెండు ఒక్కటేనని కుండబద్దలు కొడుతున్నది.

తెలంగాణలో మళ్లీ తాను గెలిస్తే మహారాష్ట్రకు వెళతానని భయపడి, రాష్ట్రంలో బీఆరెస్‌ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటయ్యాయని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం జనగామ చేర్యాల ప్రజాశీర్వాద సభలో మాట్లాడుతూ తనను రాష్ట్రానికే పరిమితం చేయాలని బీజేపీ, కాంగ్రెస్‌ చూస్తున్నాయన్నారు. మెదక్‌లో మంత్రి టీ హరీశ్‌రావు సీపీఎం నాయకులతో మంతనాలు చేయడంతో బీఆరెస్‌కు సీపీఎం సీ టీంగా మారిందన్న కొత్త ప్రచారం ఊపందుకున్నది.

పొత్తు ధర్మాన్ని విస్మరించి మోసం చేశారని బీఆరెస్‌పై ఎగిరిపడిన సీపీఎం.. మళ్లీ ఆ పార్టీకే దగ్గరవుతున్నదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్‌కు బలమున్న స్థానాల్లో సీపీఎం అభ్యర్థులను పోటీకి నిలిపి, ఓట్ల చీలిక వ్యూహంతో బీఆరెస్‌కు మేలు చేయాలని సీపీఎం తెరవెనుక ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. సీపీఐ మాత్రం ఒక స్థానం పొత్తుతో సర్దుకుని కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్నది. 

బీజేపీ వైఖరితోనే గందరగోళం

నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎవరు బీ, సీ టీమ్‌లు అన్న గందరగోళానికి తెరతీసిందే బీజేపీ అన్న అభిప్రాయాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన సాగిస్తున్నారని, అవినీతి పరులు జైలుకెళ్లాల్సిందేనని నెలల తరబడిగా చెప్పుకొస్తున్న ప్రధాని మోదీ, అమిత్‌షా వంటి నేతలు.. కేసీఆర్ అవినీతిపై తీసుకున్న చర్యలేమీ లేవు. పైగా ఎన్నికల ముందు బండి సంజయ్‌ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తొలగించడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు చేయకపోవడంతో బీజేపీకి బీఆరెస్ బీ టీం అన్న వాదన బలపడింది.

మేడిగడ్డ బరాజ్‌ కుంగిన ఘటనతో కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకునే అవకాశం దక్కినా కేంద్రం నుంచి అందుకు చర్యలు లేకపోవడంతో ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని కాంగ్రెస్ జనంలోకి బలంగా తీసుకెళుతున్నది. ఇక ప్రధాని మోదీ మరో అడుగు ముందేకేసి తమ పార్టీని ఎన్డీయేలో చేర్చుకోవాలని, కేటీఆర్‌ సీఎం అయ్యేందుకు దీవించాలని కేసీఆర్ అభ్యర్థించారని చెబుతూ.. తమ మధ్య బంధాన్ని బహిర్గతం చేశారు.

మోదీ చెప్పిన మాట నిజమేనని తాను తెలంగాణకు మంచి చేస్తే ఎన్డీయేలో చేరుతానన్నానని, కేటీఆర్‌ను సీఎంగా ఆశీర్వదించాలని కోరిందీ వాస్తవమేనని కేసీఆర్ ఇటీవల ఇండియాటూడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించడం ఆ రెండు పార్టీల అంతర్గత స్నేహాన్ని చెప్పకనే చెబుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, లోక్‌సభలో పలు బిల్లుల ఆమోదం తదితర అంశాల్లో బీజేపీ, బీఆరెస్‌ పరస్పరం వ్యవహరించిన తీరుతోనే ఆ రెండు పార్టీలు ఒక్కటన్న వాదనకు బలం పెరుగుతూ వచ్చింది. ఇక ఎంఐఎం సైతం బీజేపీకి సీ టీమ్‌గా పనిచేస్తుందని కాంగ్రెస్ మొదటి నుంచీ ఆరోపిస్తున్నది. బీజేపీని గెలిపించేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, బీఆరెస్‌ను గెలిపించేందుకు తెలంగాణలో ఎంఐఎం పనిచేస్తున్నదని విమర్శిస్తున్నది. వాటికి తోడుగా కొత్తగా బీఆరెస్‌కు సీ టీమ్‌గా సీపీఎం వాదన కూడా మొదలైంది. 

గతంలో కలిసినోళ్లే.. భవిష్యత్తులో కలుస్తారు

గతంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన బీఆరెస్ పార్టీనే ఎన్నికల పిదప సీట్లు తగ్గితే కాంగ్రెస్‌తో కలిసిపోతుందని బీజేపీ అగ్రనేతలు ఆరోపిస్తున్నారు. కుటుంబ, అవినీతి పాలనలో కాంగ్రెస్‌, బీజేపీ డీఎన్‌ఏ ఒక్కటనేనని, అవి పరస్పరం సహకరించుకుంటాయని కమలనాథులు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆరెస్‌, ఎంఐఎం మూడూ ఒక్కటేనని అమిత్ షా శనివారం నాటి తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో పునరుద్ఘాటించారు.

 

మారుతున్న ప్రచార అంశాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రోజుకో అంశం చుట్టూ తిరుగుతూ కప్పగంతులను తలపిస్తున్నది. ఎన్నికల ప్రక్రియ ఆరంభంలో బీఆరెస్ పదేళ్ల విఫల పాలన.. పథకాల వైఫల్యాలపైన, నిరుద్యోగంపై సాగిన విపక్షాల విమర్శల పర్వం మేడిగడ్డ కుంగుబాటుతో కాళేశ్వరం చుట్టూ తిరిగి.. అటు నుంచి 24గంటల ఉచిత విద్యుత్తు దిశగా సాగింది.

కర్ణాటకలో ఆరు గ్యారంటీల అమలు తీరుపై బీఆరెస్‌, కాంగ్రెస్‌ మధ్య విమర్శలు సాగాయి. ఢిల్లీ పార్టీలకు గులాములవుదామా అని బీఆరెస్ నినాదం ఎత్తుకుంటే.. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన మారాలంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది.

మధ్యలో చిదంబరం వ్యాఖ్యలతో తెలంగాణ ఉద్యమ బలిదానాల అంశాన్ని బీఆరెస్ ప్రచారాస్త్రంగా కాంగ్రెస్‌పైకి ఎక్కుపెట్టగా, మ్యానిఫెస్టోలో ఉద్యమకారులకు 25 వేల పెన్షన్‌, ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, ఇళ్లు అంటూ కాంగ్రెస్ కౌంటర్ వేసింది. ధరణి, రైతుబంధు చుట్టూ సాగుతున్న మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది.

తాజాగా మ్యానిఫెస్టోల హామీలపై ప్రచారంలో పరస్పర విమర్శల తూటాలు పేలుతున్నాయి. మధ్యలో బీజేపీ ప్రకటించిన బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణకు మద్దతు అంశాలు కూడా చర్చను రేపాయి. అయితే వాటన్నింటిలోనూ ఎన్నికల ప్రచారాన్ని సింహభాగం ప్రభావితం చేసే అస్త్రాలేవీ అధికార, విపక్షాలకు ఇప్పటిదాకా దొరకకపోవడంతో ప్రచార పర్వం నాటకీయ రీతిలో అందివచ్చిన అంశాలతోనే ముందుకెళుతున్నది. అయితే.. ఎవరు ఏ పార్టీకి బీ టీం లేదా సీ టీం తరహాలో వ్యవహరిస్తున్నారో ప్రజల్లో గందరగోళం లేదని, వారు అన్నీ గమనిస్తూనే ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏ పార్టీ ఏ టీం లో ఉన్నదో 30న తేల్చేయనున్నారని అంటున్నారు.