మహిళా రిజర్వేషన్ సత్వర అమలుకు న్యాయపోరాటం: ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ సత్వర అమలుకు న్యాయపోరాటం: ఎమ్మెల్సీ కవిత

విధాత : మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఒత్తిడి తెచ్చేందుకు భారత్ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లుగా తెలిపారు. ఆదివారం కవిత ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసులో త్వరలో ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేస్తామన్నారు. ఇందుకోసం భారత్ జాగృతి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతుందని పేర్కోన్నారు.


 



తాము గతంలో మహిళా రిజర్వేషన్ కోసం వాదించామని, దానిని వేగంగా అమలు చేయడానికి మరో పోరాటానికి సిద్ధమయ్యామని ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని అనేక రాజకీయ పార్టీలు, సంస్థలు ఉద్యమిస్తుమన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారిలో చాలామంది తమ ఆందోళనలు లేవనెత్తడానికి, సత్వర అమలు ఆవశ్యకతను చెప్పడానికి ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. తాము కూడా న్యాయపర పోరాటంలో భాగస్వామ్యమవుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు.