చిరుతను చంపి.. తలకిందులుగా వేలాడదీసి.. వీడియో
చిరుత పులిని చంపేసి.. దాన్ని తలకిందులుగా వేలాడదీశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది

లక్నో : చిరుత పులిని చంపేసి.. దాన్ని తలకిందులుగా వేలాడదీశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. చిరుతను చంపి, వేలాడదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ శామ్లీ జిల్లాలోని కనియాన్ గ్రామ సమీపంలో ఓ చిరుతను గుర్తు తెలియని దుండగులు చంపేశారు. అనంతరం ఆ చిరుత కళేబరాన్ని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత చిరుతను తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి పైశాచిక ఆనందం పొందారు. అక్కడున్న కొందరు ఈ తతంగాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్రూరమైన చర్యకు పాల్పడ్డ దుండగులను గుర్తించి, కఠినంగా శిక్షిస్తామని అధికారులు స్పష్టం చేశారు. చిరుతను వేలాడదీసిన ప్రాంతంలో అధికారులు కొన్ని ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో మరో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.