వట్టే జానయ్య యాదవ్ నుంచి ప్రాణ హాని ఉంది.. ఎస్పీ కార్యాలయం వద్ద బాధితుల ఆందోళన

- జానయ్య అనుచరులు బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు
- న్యాయం చేయాలని ప్లకార్డులతో బాధితుల నిరసన
- ఫిర్యాదు చేసి నెల రోజులు కావస్తున్నా..
- ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని పోలీసులపై ఆగ్రహం
విధాత, సూర్యాపేట, సెప్టెంబర్25: డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ నుండి తమకు ప్రాణహాని ఉందంటూ మరోసారి ఎస్పీ కార్యాలయం మెట్లు ఎక్కారు జానయ్య బాధితులు. తమ భూములను అక్రమంగా, దౌర్జన్యంగా లాక్కున్న జానయ్యపై తాము నెల రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఆయనను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ కార్యాలయం ముందు ఫ్ల కార్డులతో బాధితులు నిరసన తెలిపారు.
జానయ్య అనుచరులు కేసులు విత్ డ్రా చేసుకోవాలని తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ పోరాటానికి సూర్యాపేట ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు. జానయ్యకు మద్దతు పేరుతో కొంతమంది డబ్బులకు లొంగి, ఏదో పార్టీలు, సంఘాల పేరుతో తమ మనోభావాలు దెబ్బ తినే విధంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. తాము కూడా బహుజనులమే అన్నారు.
జానయ్యపై తాము చేస్తున్న పోరాటంలో తమతో చేతులు కలిపి జానయ్యకు శిక్ష పడే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జానయ్యను వెంటనే అరెస్ట్ చేసి, తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. తమ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని వారు విన్నవించారు.