BRS కు రుణమాఫీ గండం! రైతుబంధుపై సన్న, చిన్నకారు, కౌలు రైతుల్లో ఆవేదన
BRS రుణమాఫీ మాట తప్పడంపై గుస్సా బ్యాంకు వడ్డీలు, పెనాల్టీలతో అప్పు తడిసి మోపడైంది భూస్వాములకు రైతు బంధు ఎందుకు? రైతుబంధుకు పరిమితులుండాలంటున్న ఆర్థిక నిపుణులు విధాత ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించాలన్న కేసీఆర్ ప్రభుత్వం కలలకు రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతుల రూపంలో గండిపడనుందా? 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీఆర్ ఎస్ రుణమాఫీ హామిని నమ్మి బ్యాంకు అప్పులు చెల్లించకుండాపోయిన సన్న, చిన్న కారు రైతులు అప్పుల్లో కూరుకుపోయారా? సన్న, చిన్నకారు […]

BRS
- రుణమాఫీ మాట తప్పడంపై గుస్సా
- బ్యాంకు వడ్డీలు, పెనాల్టీలతో అప్పు తడిసి మోపడైంది
- భూస్వాములకు రైతు బంధు ఎందుకు?
- రైతుబంధుకు పరిమితులుండాలంటున్న ఆర్థిక నిపుణులు
విధాత ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించాలన్న కేసీఆర్ ప్రభుత్వం కలలకు రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతుల రూపంలో గండిపడనుందా? 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీఆర్ ఎస్ రుణమాఫీ హామిని నమ్మి బ్యాంకు అప్పులు చెల్లించకుండాపోయిన సన్న, చిన్న కారు రైతులు అప్పుల్లో కూరుకుపోయారా? సన్న, చిన్నకారు రైతులు బ్యాంకుల్లో చేసిన అప్పులపై వడ్డీలు, పెనాల్టీలకే రైతు బంధు సాయం పరిమితమైందా? కౌలు రైతుల గోడు ప్రభుత్వం పట్టించుకుంటోందా? క్షేత్రస్థాయిలో సన్న, చిన్నకారు, కౌలు రైతుల ఆవేదన చూస్తే…ఈసారి వారంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. విధాత ప్రత్యేక ప్రతినిధి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు గ్రామాల్లో జరిపిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది.
సన్న, చిన్నకారు రైతుల్లో తీవ్ర అసంతృప్తి
ఎకరం, రెండు ఎకరాలు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఎకరానికి ఏడాదికి వచ్చే పదివేల రూపాయల రైతు బంధు సాయం వారి వ్యవసాయ పెట్టుబడికి ఉపయోగపడకపోగా, బ్యాంకు అప్పుపై వడ్డీకి, పెనాల్టీకి కూడా చాలడం లేదని “విధాత” అధ్యయనంలో తేలింది. 5 ఎకరాల పొలం ఉన్న రైతుల పరిస్థితీ ఇలాగే ఉంది. “కేసీఆర్ మాట నమ్మి బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలను చెల్లించలేదని, ఈ నాలుగేళ్లలో వాటికి వడ్డీలు, పెనాల్టీలు జతకావడంతో పొలం అమ్మి కట్టాల్సిన పరిస్థితి ఉంద”ని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 20 నుంచి 200 ఎకరాల ఉన్న భూస్వాములకు కూడా రైతుబంధు వేస్తున్న కేసీఆర్, సన్నచిన్నకారు రైతులను, కౌలుదారులను మాత్రం దెబ్బకొట్టారని ఆరోపిస్తున్నారు.
“వంద ఎకరాల ఆసామికి రైతు బంధు రూపంలో పది లక్షలు జమ అవుతోంది. వీళ్లలో 99 శాతంమంది వ్యవసాయం చేయరు. ఎక్కడో సిటీల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ బాగా సంపాదిస్తుంటారు. అలాంటి వారికి రైతు బంధు ఏమి అవసరం? విదేశాల్లో ఉండేవాళ్లకు కూడా వ్యవసాయానికి సాయం పేరుతో లక్షల రూపాయలు వేస్తోందీ ప్రభుత్వం. పదెకరాల లోపు రైతులకు ఇస్తే చాలదా? ఇలా వృథా చేసే ఏడాది డబ్బుతో ఈపాటికి రుణమాఫీ చేసి ఉండవచ్చు. ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం పేద రైతులను గాలికొదిలేసింది?” అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నదేమిటి?
తెలంగాణ ప్రభుత్వం అధికారిక గణాంకాలు పరిశీలించినా, సన్న చిన్నకారు రైతుల ఆవేదనలో న్యాయం ఉందనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో చేపల చెరువులతో సహా నికరంగా సాగుభూమి దాదాపు కోటి 35 లక్షల ఎకరాలు ఉంది. రాష్ట్రంలోని మొత్తం భూభాగంలో 49 శాతం భూమి సాగులో ఉంది. సన్నకారు రైతుల చేతుల్లోని భూమి (అంటే 2.47 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు) 42 లక్షల 16 వేల ఎకరాలు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సన్నకారు రైతుల సంఖ్య 38 లక్షల 40 వేలు. వీరిలో చిన్న రైతులు అంటే రెండు హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులు 14 లక్షల 9 వేల మంది ఉండగా, వారి చేతుల్లో ఉన్న భూమి 48 లక్షల 85వేల ఎకరాలు.
మధ్య తరహా రైతులు అంటే నాలుగు హెక్టార్లు (సుమారు 10 ఎకరాలలోపు) భూమిగల రైతుల సంఖ్య 5 లక్షల 64 వేల మంది. వీరి చేతిలో ఉన్న భూమి 36 లక్షల, 25 వేల ఎకరాలు. నాలుగు నుంచి 12 హెక్టార్లలోపు అంటే సుమారు 10 నుంచి 25 ఎకరాల భూమిగల రైతుల సంఖ్య లక్షా 26 వేల మంది. వీరి చేతిలో ఉన్న భూమి 17 లక్షల ఎకరాలు. పెద్ద రైతులు అంటే పది హెక్టార్లకు పైన ఉండేవాళ్లు 9 వేలమంది ఉన్నారు. పెద్ద రైతుల చేతిలో ఉన్న భూమి 3 లక్షల 34 వేల ఎకరాలు. ఈ ఒక్క కేటగిరీ రైతులను రైతు బంధు నుంచి మినహాయిస్తే ఏడాదికి 334 కోట్ల రూపాయలు అంటే నాలుగేళ్లలో 1336 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతుంది.
అంటే సన్న, చిన్నకారు రైతుల రుణమాఫీకి సరిపోయే డబ్బు ఇక్కడే ప్రభుత్వానికి వచ్చేది. పెద్ద రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు సాయం ఇచ్చినా, ఇవ్వకపోయినా వచ్చే నష్టమేమి ఉండదు. వీరు ప్రభుత్వం నుంచి అలాంటి సాయం ఆశించే స్థితిలో కూడా లేరు. పది ఎకరాలపైన ఉన్న రైతులందరికీ రైతు బంధు నిలిపివేస్తే ఏడాదికి 2500 నుంచి 3000 కోట్ల రూపాయలు మిగులుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇలా నాలుగేళ్లలో పదివేల కోట్ల రూపాయలు మిగిలేది. ఇది కేవలం భూ కమతాల సైజును దృష్టిలో పెట్టుకుంటే ఉజ్జాయింపుగా మిగిలే డబ్బు. ఈ కేటగిరికి అదనంగా ఆదాయ పన్ను కట్టేవారిని, ఇన్‌స్టిట్యూషనల్ హోల్డింగ్స్ అంటే సంస్థాగతంగా భూమి కలిగినవాళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోని భూమిని, కార్లు, బంగళాలు కలిగినవాళ్లని కూడా రైతు బంధు నుంచి మినహాయించాల్సి ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మొత్తాన్ని సన్న, చిన్నకారు రైతుల రుణమాఫీగా ఈ నాలుగేళ్లలో వినియోగించి ఉన్నా ఈ రోజు వారంతా ప్రభుత్వం పట్ల ఎంతో కృతజ్ఞతగా ఉండేవాళ్లు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ ఇచ్చినమాట ప్రకారం రుణమాఫీ చేయడంతో, రెండోసారి ఆయన మాటను బాగా నమ్మిన రైతులు ఈ నాలుగేళ్లలో అలాంటిదేమీ జరగకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేస్తుందని నమ్ముతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇది బీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కౌలురైతుల గోస ఇది
రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లోని 31 మండలాలకు చెందిన 34 గ్రామాల్లో మొత్తం 7,734 మంది రైతులను ఇటీవల ‘రైతు స్వరాజ్య వేదిక’ సర్వే చేసింది. ఈ సర్వే చేసినవారిలో 2753 మంది అంటే మొత్తం రైతుల్లో 35.6 శాతం కౌలు రైతులు ఉన్నారు. అంటే మొత్తం రైతుల్లో సర్వే చేసిన రైతుల శాతం 6.8కాగా, కౌలు రైతులు 19 శాతంగా ఉన్నారు.
ఈ మొత్తం కౌలు రైతుల్లో 60.9 శాతం అంటే అత్యధికంగా బీసీ సామాజికవర్గాలు, ఎస్సీలు, 22.9 శాతం, ఎస్టీలు 9.7 శాతం, ఓసీలు 4.2 శాతం, మైనారిటీల్లో 2.4 శాతం ఉన్నట్లు ఈ వేదిక అధ్యయనంలో తేలింది. ఈ వర్గాలు ఆర్థికంగా బలపడాలంటే కౌలు రైతులకు గుర్తింపు కావాలి. రైతు బంధు పథకానికి పదెకరాలలోపు సీలింగ్ పెట్టి కౌలు రైతులను ఆదుకోవాలని ఈ సర్వేలో పాల్గొన్న మెజార్టీ రైతులు కోరుతున్నట్లు స్పష్టమైంది.
కానీ ప్రభుత్వం కౌలు రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీనిపై చర్చ వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ కౌలు రైతులు ఏటా తాము సాగు చేసే భూమిని వదిలి కొత్త కౌలు భూమిని సాగు చేస్తుంటారు కాబట్టి వారిని గుర్తించడం సాధ్యం కాదని సమస్యను దాట వేస్తున్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రెండవ స్థానంలో ఉన్నది. అందుకే రైతుబంధు పథకానికి పరిమితి పెట్టి కౌలు రైతులను కూడా ఆదుకోవాలన్న డిమాండ్ తెలంగాణ రైతుల్లో ఎక్కువగా వినబడుతోంది.