ఎన్నికల పోరు హోరాహోరీగానే!.. లోక్‌పోల్‌ మెగా పోల్‌ సర్వేలో వెల్లడి

ఎన్నికల పోరు హోరాహోరీగానే!.. లోక్‌పోల్‌ మెగా పోల్‌ సర్వేలో వెల్లడి
  • ఓటు శాతంలో చాలా స్వల్ప తేడా
  • కాంగ్రెస్‌కే మొగ్గు కనిపించే అవకాశం
  • కాంగ్రెస్‌ పార్టీకి 61-67 మధ్య సీట్లు!
  • 45-51 మధ్య ఆగనున్న బీఆరెస్‌
  • ఎంఐఎంకు 6 నుంచి 8 స్థానాలు
  • 2 లేదా మూడు స్థానాల్లో బీజేపీ



విధాత: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని లోక్‌పోల్‌ మెగా ప్రీపోల్‌ సర్వే అంచనా వేసింది. అయితే.. రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో పోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్‌ 10 నుంచి సెప్టెంబర్‌ 30 వరకూ ఈ సర్వే నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్‌కు 61-67 మధ్య సీట్లు లభించే అవకాశం ఉన్నదని సర్వే పేర్కొన్నది. బీఆరెస్‌ 45-51 స్థానాల వరకు గెలుస్తుందని తెలిపింది. ఎంఐఎంకు 6 నుంచి 8 స్థానాల వరకూ లభిస్తాయని వెల్లడించింది. బీజేపీ 2 నుంచి 3 చోట్ల గెలుపొందే అవకాశం ఉన్నదని, ఇతరులు గరిష్ఠంగా ఒక స్థానం గెలుచుకునే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నది. ఓటు షేరింగ్‌లో 39% – 42% మధ్య బీఆరెస్‌కు ఓట్లు లభించే అవకాశం ఉన్నదని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 41%-44% మధ్య ఓట్లు లభిస్తాయని పేర్కొన్నది.


ఎంఐఎంకు 3% నుంచి 4% శాతం ఓట్లు రావచ్చొని తెలిపింది. బీజేపీ 10% నుంచి 12% శాతం మధ్య ఓట్లు తెచ్చుకోవచ్చని పేర్కొన్నది. ఇతరులు మూడు నుంచి ఐదు శాతం మధ్య ఓట్లు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి 500 చొప్పున మొత్తం 60 వేల నమూనాలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వేర్వేరు ప్రాంతాల్లోని 30 పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసి, సర్వే చేశారు. అత్యుత్తమ ఫలితాల కోసం సర్వే డాటా సెట్‌లను అసెంబ్లీ, రాష్ట్ర స్థాయి అంశాల ఆధారంగా రూపొందించినట్టు లోక్‌పోల్‌ సంస్థ తెలిపింది. పోటీలో మూడు ప్రధాన పార్టీలు బీఆరెస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఉన్నా.. పోటీ మాత్రం కాంగ్రెస్‌, బీఆరెస్‌ మధ్యే కేంద్రీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వే తెలిపింది.


ఎన్నికల హామీలు అమలు చేయడంలో వైఫల్యం, స్థానిక నేతలపై ప్రజల అసంతృప్తితో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని పేర్కొన్నది. సీఎం కేసీఆర్ పైనా వ్యతిరేకత పెరుగుతున్నదని తెలిపింది. బీఆరెస్‌కు గట్టి పోటీదారుగా చెప్పుకొంటున్న బీజేపీ.. ఓటు బ్యాంకును భారీగా కోల్పోయే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. పాతబస్తీలో ఎంఐఎం పట్టు నిలుపుకొంటుందని తెలిపింది. బీఆరెస్‌ను అధిగమించి కాంగ్రెస్‌ సీట్లు తెచ్చుకునే అవకాశాలకు ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజలపై ప్రభావం చూపుతుండటమేనని పేర్కొన్నది. నిజామాబాద్, మెదక్ లోకసభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆరెస్‌ పట్టు నిలుపుకుంటుందని సర్వే తెలిపింది. ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్, నల్గొండ, జహీరాబాద్ లోక్‌సభ స్థానాల పరిధిలో అధిక సంఖ్యలో అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్‌కు దక్కుతాయని అంచనా వేసింది.


కాంగ్రెస్‌, బీఆరెస్‌ పోటాపోటీ


చాణక్య పొలిటికల్‌ కన్సల్టెన్సీ ఇప్పటి వరకూ 61 నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేయగా.. అందులో కాంగ్రెస్‌, బీఆరెస్‌ పోటాపోటీగా చెరొక 27 స్థానాలు గెలుచుకున్నాయని తేలింది. ఎంఐఎంకు ఆరు స్థానాలు, బీజేపీకి ఒక స్థానం లభించే అవకాశం ఉన్నదని సర్వే తెలిపింది.