రసవత్తరంగా పాలమూరు ఎమ్మెల్సీ పోరు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆరెస్‌ మధ్య పోరు కేంద్రీకృ తమై ఉన్నది

రసవత్తరంగా పాలమూరు ఎమ్మెల్సీ పోరు

కాంగ్రెస్, బీఆరెస్‌ మధ్య రసవత్తర పోరు

క్రాస్ ఓటింగ్ పైనే అధికార పార్టీ దృష్టి

మెజారిటీ ‘స్థానిక’ స్థానాలు బీఆరెస్‌కు

తనవైపు తిప్పుకొనే యత్నాల్లో కాంగ్రెస్‌

క్రాస్ ఓటింగ్ జరిగితే జీవన్ రెడ్డికే మెజార్టీ! రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

విధాత, ఉమ్మడి, మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆరెస్‌ మధ్య పోరు కేంద్రీకృ తమై ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న గులాబీ పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి, పోయిన పరువు నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అదే ఊపులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇరు పార్టీల అభ్యర్థులు ఒకే సామాజిక వర్గం కావడం, ఇద్దరు నేతలకు ఆర్థిక బలం ఉండటంతో నువ్వా నేనా అనే స్థాయిలో ప్రచారంలో దూసుకెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్మా కంపెనీ అధినేతల్లో ఒకరైన మన్నే జీవన్ రెడ్డి, బీఆరెస్‌ నుంచి పాలమూరు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. గతంలో ఈ ఎమ్మెల్సీ స్థానంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆరెస్‌ తరఫున గెలుపొందారు. ప్రస్తుతం ఆయన కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం అదే స్థానానికి ఎన్నిక జరుగుతోంది. అప్పుడు ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆరెస్‌ అభ్యర్థిగా భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు కూడా బీఆరెస్‌ అదేస్థాయిలో గెలుపొందాలని చూస్తోంది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆరెస్‌ పరిస్థితి అధ్వానంగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆరెస్‌కు ఓటేసిన సభ్యులు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ జరిగితే కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం పొందే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరగకుండా బీఆరెస్‌ అధిష్ఠానం కట్టడి చేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే ఆస్కారం ఉంటుందని అంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండటంతో బీఆరెస్ అధిష్ఠానం మాటవినే పరిస్థితిలో సభ్యులు ఉంటారా? అనే సందేహాన్ని గులాబీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం తక్కువగా ఉంది. ఎన్నికల సమయం వరకు వీలైంత మంది సభ్యులను కాంగ్రెస్ వైపు తిప్పుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయాన్ని సవాలుగా స్వీకరించారు. ఇప్పటికీ ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభమైందని తెలుస్తున్నది.

జిల్లాలో 1439 ఓటర్లు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి 1439 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 832 మంది సభ్యులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్‌లు ఉండగా.. 449 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 14 మంది ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులు ఉన్నారు. వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలను పరిశీలిస్తే 900 మంది బీఆరెస్‌కు చెందిన సభ్యులు ఉండగా కాంగ్రెస్‌కు అప్పట్లో 218 మంది మాత్రమే ఉన్నారు. బీజేపీకి 35 మంది ఉండగా ఇతర పార్టీ లకు చెందిన వారు ఉన్నారు. ఆ రీత్యా ఈసారి బీఆరెస్‌ అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం బీఆరెస్‌కు రాజకీయంగా ఎదురు గాలి వీచడంతో పాటు.. కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయి. సంఖ్యా బలం గులాబీ పార్టీకి ఉన్నా సభ్యులను నడిపించే నాయకులు లేకుండా పోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 14 స్థానాల్లో రెండు స్థానాలకే ఆ పార్టీ పరిమితం అయ్యింది. దీంతో జిల్లాలో ఎమ్మెల్యేల సంఖ్య కాంగ్రెస్‌కు కావడంతో స్థానిక సంస్థల సభ్యులు అధిక శాతం ఎమ్మెల్యేల మాట వింటారని పరిశీలకులు అంటున్నారు. పార్టీ ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యేల మాటపైనే సభ్యులు ఉండే అవకాశం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్థానిక సంస్థల సభ్యులు కాంగ్రెస్ వైపు తరలి వస్తున్నారు. ఇదివరకే మహబూబ్ నగర్‌లో మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే మద్దతుగా నిలిచారు. బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి ఏకంగా బీఆరెస్‌కు చెందిన చైర్మన్‌ను గద్దె దించారు. ఈ నియోజకవర్గంలో బీఆరెస్ ఎంపీటీసీలు, ఎంపీపీలు ఇప్పటికీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. ఇక్కడ బీఆరెస్ అభ్యర్థికి భంగపాటు తప్పడం లేదు. దేవరకద్ర నియోజకవర్గంలో కూడా బీఆరెస్‌ ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే చాలా మంది బీఆరెస్ ఎంపీటీసీలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మక్తల్ నియోజకవర్గం కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వెంటే బీఆరెస్‌కు చెందిన సభ్యులు ఉన్నారు. నారాయణ పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఆధ్వర్యంలో బీఆరెస్‌కు చెందిన ఎంపీటీసీలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల సభ్యులు కాంగ్రెస్ పార్టీ కే జై కొడుతున్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఇక్కడ బీఆరెస్ తుడిచిపెట్టుకు పోయింది. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో రెండు స్థానాల్లో బీఆరెస్‌ ఎమ్మెల్యేలు ఉండగా మిగతా 12 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి గెలుపు సునాయాసంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.