ఆనంద్ మహీంద్రాపై కేసు.. ఎయిర్ బ్యాగులపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ..!

Kanpur Case | కాన్పూర్ స్కార్పియో ఎన్‌యూవీ ప్రమాదం కేసులో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సహా 12 మందిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎయిర్ బ్యాగులు లేవంటూ వచ్చిన ఆరోపణలను మహీంద్రా అండ్ మహీంద్రా తోసిపుచ్చింది.
స్కార్పియోలో ఎయిర్ బ్యాగులు ఉన్నాయా? ప్రమాద సమయంలో ఎందుకు ఓపెన్ కాలేదో స్పష్టంగా పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. మృతుడు తన తండ్రి నుంచి స్కార్పియో ఎస్‌యూవీని బహుమతిగా అందుకున్నాడు. లక్కో నుంచి కాన్పూర్‌కు వెళ్తున్న సమయంలో పొగమంచు కారణంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఎస్‌యూవీ బోల్తాపడింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు సీటు బెల్టు ధరించినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం తర్వాత ఎయిర్ బ్యాగులు ఎందుకు బిగించలేదంటూ మృతుడి కుటుంబ సభ్యులు మహీంద్రా సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించారు.
స్థానిక సర్వీస్ స్టేషన్ మేనేజర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, చంపేస్తానని బెదిరించాడని మృతుడి తండ్రి రాజేశ్ మిశ్రా ఆరోపించారు. ఈ మేరకు ఆనంద్ మహీంద్రాతో సహా 12 మందిపై కాన్పూర్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. అయితే, లక్షల విలువైన కారులో భద్రత చర్యలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఈ వ్యవహారంపై కంపెనీ స్పష్టతనిచ్చింది.
ప్రమాదం జరిగిన కారులో ఎయిర్‌బ్యాగులు ఉన్నాయని స్పష్టం చేసింది. వాహనం బోల్తా పడడం వల్లనే ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కాలేదని చెప్పింది. ఈ కేసు 18 నెలలకుపైగా పాతదని, ఈ ఘటన జనవరి 2022లో జరిగిందని పేర్కొంది. 2020లో తయారైన స్కార్పియో ఎస్9 వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయని కంపెనీ ధ్రువీకరించింది.
అయితే, తమ పరిశీలనలో ఎయిర్‌బ్యాగుల్లో లోపం లేదని, వాహనం బోల్తాపడ్డ సమయంలో ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావని పేర్కొంది. దీనిపై గత ఏడాది అక్టోబర్‌లో తమ టీం వివరణాత్మక సాంకేతిక పరిశోధన నిర్వహించినట్లు తెలిపింది. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉందని, విచారణకు పూర్తి సహకరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మృతుడి కుటుంబానికి సానుభూతి ప్రకటించింది.