వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా ప్రియాంక పోటీ?

దేశంలోని హైప్రొఫైల్‌ స్థానాల్లో ఒకటైన వారణాసిలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ పోటీ చేయాలని తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీ ప్రతిపాదించినట్టు సమాచారం.

  • By: TAAZ    latest    Dec 20, 2023 10:14 AM IST
వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా ప్రియాంక పోటీ?
  • ఇండియా కూటమి సమావేశంలో మమత ప్రతిపాదన?

న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కాంగ్రెస్‌ ఇంకా ప్రకటించనప్పటికీ.. ఆశలు, ఆకాంక్షలు మాత్రం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో ప్రియాంక గాంధీ తెలంగాణలోని మెదక్‌ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. తాజాగా బుధవారం జరిగిన ఇండియా కూటమి నాలుగవ సమావేశంలో సైతం ప్రియాంక గాంధీ పోటీ చేసే స్థానంపై ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తున్నది.


ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని మమత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రతిపాదించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే సమావేశంలో మమతా బెనర్జీ ప్రియాంక పోటీ చేసే స్థానంపై తన అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలుస్తున్నది. వారణాసిలో ప్రధాని మోదీపై ప్రియాంక బరిలో దిగితే బాగుంటుందని ఆమె చెప్పారని టీఎంసీ వర్గాలు తెలిపాయి.


వాస్తవానికి 2019లోనే ప్రియాంక గాంధీ వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేస్తారని ఊహాగానాలు చెలరేగాయి. కానీ.. అక్కడ అజయ్‌రాయ్‌ని కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. సమావేశం అనంతరం మమతాబెనర్జీని ప్రియాంక పోటీ చేసే స్థానం గురించి ప్రశ్నించగా.. తాము సమావేశంలో చర్చించినవన్నీ బయట చెప్పడం సాధ్యం కాదని ఆమె బదులివ్వడం విశేషం. కాగా.. ఈ నెలాఖరుకల్లా రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాటు అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చి, జనవరి 2వ వారం నాటికి జాతీయ స్థాయిలో ఒప్పందాలు ఖరారు చేసుకోవాలని నిర్ణయించాయి.