Mamunuru: మామునూరు ఎయిర్ పోర్టు.. భూనిర్వాసిత రైతుల నిరసన

Mamunuru: మామునూరు ఎయిర్ పోర్టు.. భూనిర్వాసిత రైతుల నిరసన
  • గుంటూరు పల్లె, గాఢిపల్లి, నక్కలపల్లి ప్రాంతంలో ఉద్రిక్తత
  • భూ సర్వేకు వచ్చిన ఆర్డీవో, తహసిల్దార్లను అడ్డుకున్న ప్రజలు
  • తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ కోరుతున్న రైతులు
  • మూడు ముఖ్యమైన సమస్యలను తీర్చాలంటూ షరతు
  • ఎయిర్ పోర్టుకు భూమి ఇచ్చేందుకు అభ్యంతరం లేదు

విధాత ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణ సందర్భంగా భూముల కోల్పుతున్న రైతులు మంగళవారం నిరసనకు దిగారు. గుంటూరుపల్లికి చెందిన రైతులు, గ్రామస్తులు వరంగల్, నెక్కొండ ప్రధాన రహదారిపైకి చేరి ఆందోళన చేపట్టారు. భూముల సర్వేకు వచ్చిన ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తహసిల్దార్ నాగేశ్వర్ రావులతో పాటు సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులను పెద్ద ఎత్తున మొహరించారు. గ్రామస్తులను, రైతులను శాంతింపచేసేందుకు పోలీసులు, రెవిన్యూ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎయిర్ పోర్టు నిర్మాణంతో తమ గ్రామంలో భూములు కోల్పోతున్నామని ఈ సందర్భంగా తమ డిమాండ్లు పరిష్కరించిన తర్వాత భూ సర్వే చేపట్టి, సేకరించాలంటూ షరతులు విధించారు. గ్రామస్తులు, రైతులు వందల సంఖ్యలో రోడ్డుపైకి చేరుకుని జై జవాన్, జై కిషన్ అంటూ నినాదాలు చేశారు తమ డిమాండ్లు పరిష్కరించకుండా ముందుకు వెళితే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూమిని ఇచ్చేందుకు తాము సిద్ధమని, అయితే తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ షరతులు విధించడం గమనార్హం.

మూడు డిమాండ్లు పరిష్కరించాలని షరతు

తమకు ప్రజాప్రతినిధులు, అధికారులు గతంలో ఇచ్చిన మూడు ముఖ్యమైన డిమాండ్లు పరిష్కరించాలన రైతులు, గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. గుంటూరుపల్లెకు వచ్చే ప్రస్తుత రోడ్డుకి ప్రత్యామ్నాయంగా నూతన రోడ్డు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. తాము కోల్పోతున్న భూమికి మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. కోల్పొతున్న భూమికి భూమికి ఇస్తామనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. నిర్మించే ఎయిర్ పోర్టులో నిర్వాసిత కుటుంబాలకు చెందిన వారి అర్హత మేరకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలపై స్పష్టతనిస్తే తాము భూములు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగింది. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ కొరత, ఇతర రాజకీయ కారణాలతో రైతుల్లో అపనమ్మకం నెలకొన్నందున రోడ్డెక్కినట్లు చర్చసాగుతోంది.