క్రిస్మస్ వేడుకలకు మెదక్ CSI చర్చి సిద్ధం

వివిధ రాష్ట్రాల నుంచి తరలి రానున్న భక్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన చర్చి కమిటీ సభ్యులు… వేకువజాము నుంచే ప్రార్థనలు ప్రారంభం విధాత‌, ఉమ్మడి మెదక్ బ్యూరో: కరుణామయుడి ఆలయం.. ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం.. ఆనాటి కట్టడాలను కళ్లారచూస్తే తప్పా వర్ణించటం ఎవరితరం కాదు.. అదే మెదక్‌లోని ఏసయ్య కోవెల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చి. డిసెంబర్‌ 25న లోక రక్షకుడి అవతరణ వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఏసయ్య మందిరంలో ప్రతి […]

క్రిస్మస్ వేడుకలకు మెదక్ CSI చర్చి సిద్ధం
  • వివిధ రాష్ట్రాల నుంచి తరలి రానున్న భక్తులు
  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన చర్చి కమిటీ సభ్యులు…
  • వేకువజాము నుంచే ప్రార్థనలు ప్రారంభం

విధాత‌, ఉమ్మడి మెదక్ బ్యూరో: కరుణామయుడి ఆలయం.. ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం.. ఆనాటి కట్టడాలను కళ్లారచూస్తే తప్పా వర్ణించటం ఎవరితరం కాదు.. అదే మెదక్‌లోని ఏసయ్య కోవెల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చి. డిసెంబర్‌ 25న లోక రక్షకుడి అవతరణ వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

ఏసయ్య మందిరంలో ప్రతి వస్తువు కళాత్మకమే.. ప్రతి కట్టడం ప్రత్యేకమే.. మహా దేవాలయం వీక్షణం నయనానందకరమే. రెవరెండ్‌ చార్లెస్‌ వాకర్‌ పాస్నెట్‌ ఆధ్వర్యంలో 1914 నుంచి 1924 వరకు చర్చి నిర్మాణం జరిగింది. డిసెంబర్‌ 25, 1924లో ప్రారంభించారు.

నిర్మాణ సౌందర్యాన్ని తిలకించి పులకించి పోవాల్సిందే..

ఆధ్యాత్మిక, కళాత్మకతల మేళవింపుతో చారిత్మాక సీఎస్‌ఐ చర్చి ప్రసిద్ధిగాంచింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చ‌ర్చిని సందర్శించిన వారెవరైనా నిర్మాణ సౌందర్యాన్ని తిలకించి పులకించి పోవాల్సిందే. చర్చిలో మూడు వైపులా కుడ్యాలపై కరుణామయుని చిత్రాలు అబ్బుర పరుస్తాయి. స్పెయిన్‌ గ్లాస్‌ పలకలపై చిత్రించిన క్రీస్తు జననం, శిలువ, పునరుత్థానం దృశ్యాలు కేవలం సూర్య కిరణాలతోనే తేజోవంతంగా ప్రకాశించడం వాటి ప్రత్యేకత.

ఈ దృశ్యాలు తిలకించిన పర్యాటకులు మంత్ర ముగ్ధులు కావాల్సిందే. దేవదారు కర్రతో, పక్షిరాజు ఆకృతిలో తయారుచేసి పరిశుద్ధ గ్రంథ వేధిక మరో ఆకర్షణ. చ‌ర్చిలో ప్రసంగ వేదికను బాల్‌స్టోన్‌తో రూపొందించారు. ఫర్నీచర్‌ కోసం రంగూన్‌ టేకు కర్రను, ఇతరత్రా ఆసనాలకు గులాబీ కర్రలను వినియోగించారు. ఈ చర్చి కట్టడాలను తిలకించిన పర్యాటకులు మళ్లీ మళ్లీ వస్తుండటం ఇక్కడి నిర్మాణ శైలి ప్రత్యేకత.

ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబ‌ర్ 25న‌ జరిగే క్రిస్మస్‌ వేడుకలకు మెదక్‌ సీఎస్‌ఐ చర్చిని నిర్వాహకులు అందంగా అలంకరించారు. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అనేక రకాల గిఫ్టులు

ఏసయ్య జన్మ దినమైన క్రిస్మస్‌ పండగ డిసెంబర్‌ 25న జరగనుంది. కాగా క్రిస్మస్‌ సంప్రదాయాల్లో ప్రధానంగా ఏడు అంశాలు ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉన్నా యి. అందులో గిఫ్ట్‌లు ఇవ్వ డం ప్రత్యేకత. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ఇళ్లకు వెళ్లి క్యారెల్స్‌ గీతాలు ఆలపించడం, ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం, బహుమతులు పంచుకోవడం, కేక్‌కట్‌ చేసుకోవడం ఆనవాయితి.

ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని జనరల్‌ స్టోర్స్, ఫ్యాన్సీ స్టోర్లలో విభిన్న రకాల బహుమతులు కొలువు దీరాయి. ఏసుక్రీస్తు, మేరిమాత రూపాలతో, శిలువ గుర్తులతో ఉన్న వాల్‌ హ్యాంగింగ్స్, రకరకాల ఫొటో ఫ్రేములు, క్రీస్తు బొమ్మతో ఉన్న గడియారాలు, శాంతాక్లాజ్‌ బొమ్మలు లభిస్తున్నాయి.

క్రైస్తవుల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్స్‌ కూడా దొరుకుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మవత్తాంతాన్ని, బోధన తెలిపే సీడీలు, డీవీడీలు లభిస్తున్నాయి. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు తమ సన్నిహితు లు, మిత్రులు, బంధువులకు అందజేసేందుకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. క్రీస్తు శకం 300ల నుంచే బహుమతులు పంచే సంప్రదాయం ఉందని క్రైస్తవ మతపెద్దలు చెబుతున్నారు.

దేశ నలుమూలల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు

క్రిస్మస్‌ పర్వదినాన దేశ నలుమూలల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చికి వస్తారని, ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చెప్పారు.

ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే ఆలయం తరఫున వలంటీర్లను సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 25వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకే మొదటి ప్రార్థన ఉంటుందని తెలిపారు.

రంగు రంగుల విద్యుత్ కాంతులతో మెరుస్తున్న మెదక్ చర్చి

రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఒక్కసారి చర్చి ప్రాంగణంలోకి వచ్చి చూస్తే కన్నుల పండువగా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదైన చర్చిగా ప్రసిద్ధిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. మెదక్ చర్చికి ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 13 జిల్లాలకు మెదక్ డాయాసిస్ పరిధి విస్తరించి ఉంది.

భారీ భద్రత…

క్రిస్మస్ పర్వదిదినం సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అధ్వర్యంలో భారీ భద్రత ఎర్పాటు చేశారు. అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు 13 మంది సీఐలు.. ఎస్ ఐ లు…పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసిన ట్లు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. జిల్లా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డితో పాటు, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు.