మెద‌క్‌: పోలీసు దెబ్బలతో ఖదీర్ మృతి..! పోలీసులపై వేటు..!

సీఐ మ‌ధు, ఎస్ఐ రాజశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు డీఐజీ ఆదేశాల మేరకు విచారణ అధికారిగా చంద్ర శేఖర్ రెడ్డి.. ఖదీర్ అంత్యక్రియ‌ల్లో పాల్గొన్న కార్వాన్ ఎమ్మెల్యే అనుమానంతో ఓ నిండు ప్రాణం బ‌ల‌యింది. దొంగ అనే నెపం మోప‌డంతో పాటు పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువ‌చ్చి చిత్ర‌హింస‌లు పెట్ట‌డం వ‌ల్లే చ‌నిపోయాడని భార్య ఆరోపిస్తున్న వైనం ఒక వైపు. దొంగ‌త‌నం కేసులో తీసుకొచ్చాం కానీ హింస‌కు గురి చేయ‌లేద‌ని పోలీసులు చెప్తున్న వైనం మ‌రోవైపు. ఈ […]

మెద‌క్‌: పోలీసు దెబ్బలతో ఖదీర్ మృతి..! పోలీసులపై వేటు..!
  • సీఐ మ‌ధు, ఎస్ఐ రాజశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు
  • డీఐజీ ఆదేశాల మేరకు విచారణ అధికారిగా చంద్ర శేఖర్ రెడ్డి..
  • ఖదీర్ అంత్యక్రియ‌ల్లో పాల్గొన్న కార్వాన్ ఎమ్మెల్యే

అనుమానంతో ఓ నిండు ప్రాణం బ‌ల‌యింది. దొంగ అనే నెపం మోప‌డంతో పాటు పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువ‌చ్చి చిత్ర‌హింస‌లు పెట్ట‌డం వ‌ల్లే చ‌నిపోయాడని భార్య ఆరోపిస్తున్న వైనం ఒక వైపు. దొంగ‌త‌నం కేసులో తీసుకొచ్చాం కానీ హింస‌కు గురి చేయ‌లేద‌ని పోలీసులు చెప్తున్న వైనం మ‌రోవైపు. ఈ ఘ‌ట‌న‌తో ఎస్ఐ, కానిస్టేబుళ్ల‌ల‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్న పై అధికారులు. ఏది ఏమైనా ఒక ప్రాణం బ‌లి కావ‌డం మాత్రం బాధాక‌రం.

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: దొంగ అనే అనుమానంతో మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్‌ను పట్టణ పోలీస్‌లు స్టేష‌న్‌కు తీసుకువ‌చ్చారు. విచార‌ణ‌లో నిర్దోషి అని తేల‌డంతో తహశీల్దార్ ముందు బైండోవర్ చేసి వదిలేశారు.

అయితే ఖదీర్‌ను పోలీస్‌లు 3 రోజులపాటు చిత్ర హింసలు పెట్టారని ఖదీర్ భార్య సిద్దేశ్వరి జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శినికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా ఖదీర్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెంద‌గా.. శనివారం ఖదీర్ మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి నర్సాపూర్ సిఐ మదార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తుతో మెదక్ తీసుకెళ్లారు.

ఖ‌దీర్ మృతిపై ఎంఐఎం(mim) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ డీజీపీ అంజనీకుమార్‌తో మాట్లాడారు. చిత్ర హింసలు పెట్టి మృతికి కారకులైన ఎస్ఐ, కానిస్టేబుళ్లతో పాటు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని అసదుద్దిన్ ఓవైసీ డీజీపీకి ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణకు డీఐజీ ఆదేశించారు.

విచారణ అధికారిగా ఐజీ చంద్ర శేఖర్‌రెడ్డి

ఖ‌దీర్ మృతి సంఘటనపై విచారణ అధికారిగా హైదరాబాద్ రేంజ్ అధికారి చంద్ర శేఖర్ రెడ్డిని డీఐజీ(dig) అంజనీకుమార్ నియమించారు.ఎస్పీ రోహిణి ప్రియదర్శినికి కూడా ఫిర్యాదు అందడంతో ఎస్ఐ రాజశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్ల‌పై బదిలీ వేటు పడింది.

ఉన్న‌తాధికారుల ఆదేశంతోనే ఖ‌దీర్ అదుపులోకి..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఖదీర్‌ను అదుపులోకి తీసుకున్నామని sb అధికారుల విచారణలో సదరు ఎస్ ఐ, కానిస్టేబుళ్లు చెప్పినట్లు సమాచారం. అయితే డిఎస్పీ సైదులు మాత్రం ఖదీర్‌ను కొట్టలేదని వివరణ ఇచ్చారు.

చైన్ స్నాచర్ జరిగిందన్న కోణంలో ఖదీర్‌ను తీసుకొచ్చి విచారణ జరిపి తహశీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు చెప్పారు. మృతుని బంధువులు, మాత్రం పోలీస్‌లు కొట్టిన దెబ్బలకు మృతి చెందాడ‌ని ఆరోపిస్తున్నారు.

ఖదీర్ కుటుంబానికి 50లక్షలు ఇవ్వాలి: ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్

ఖదీర్ మృత దేహానికి ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్ గాంధీ ఆసుపత్రి ఆర్ ఎం ఓతో మాట్లాడి పోస్టుమార్టం చేయించి మెదక్ పంపించారు. శనివారం ఉదయం ఖదీర్ మృత దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉండి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఖదీర్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు

జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శినికి శనివారం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోయుద్దిన్ కలిసి ఫిర్యాదు చేశారు. ఖ‌దీర్‌ని కొట్టిన పోలీస్ అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ని కోరారు. ఖదీర్ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి చదివించాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే డిమాండ్ల‌కు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

సిఐ మధు, Si రాజశేఖర్, ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌పై చర్యలు: ఎస్పీ రోహిణి ప్రియ‌ద‌ర్శిని

ఖదీర్ మృతి ఘ‌ట‌న విష‌యమై పోలీస్ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఒక ప్రకటనలో తెలిపారు.

మెదక్ టౌన్ సీఐ మధు, ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుళ్లు పవన్, ప్రశాంత్‌పై వేటు పడింద‌ని, తక్షణమే వారు హైదరాబాద్ ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన‌ట్టు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఒక ప్రకటనలో తెలిపారు.