మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో మేడారం జనసంద్రమైంది. మహా జాతర దగ్గరపడుతున్న కొద్దీ

మేడారానికి పోటెత్తిన భక్తులు

– సెలవురోజు జనంతో కిటకిట

– పలువురు వీఐపీల సందర్శన

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడారానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో మేడారం జనసంద్రమైంది. మహా జాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న తల్లులను తనివితీరా కొలిచేందుకు బారులు తీరుతున్నారు. నెల రోజుల క్రితం నుంచి భక్తుల రద్దీ పెరుగుతోంది. వీఐపీల తాకిడి కూడా పెరిగింది. మంత్రి సీతక్క జాతర సందర్భంగా చేపట్టిన అభివృద్ధికార్యక్రమాలు పర్యవేక్షించారు.



 


ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లోని ప్రజలు వన దేవతల దర్శనానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆదివారం మేడారం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మచ్చాపురం వద్ద ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. జంపన్న వాగు నుంచి చింతల్ క్రాస్‌ రోడ్డు వరకు రద్దీ కొనసాగుతున్నది. పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.