ఇసుక వల్లే కుంగింది.. డిజైన్ లోపం ఉంటే తొలి ఏడాదే తెలిసేది

- ఎక్కడా వంద శాతం పరిపూర్ణ ఉండదు
- ఎక్కడో పొరపాటైతే ఎక్కడో జరిగింది
- ఈ వేసవిలోనే మరమ్మతులు పూర్తి
- ఎల్అండ్‌టీ ఆ బాధ్యత నిర్వర్తిస్తుంది
- మేడిగడ్డపై ఈఎన్సీ మురళీధర్‌రావు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడిగడ్డ బరాజ్.. ఇసుక వల్లే కుంగిందని అనుకుంటున్నామని ఈఎన్సీ మురళీధర్ రావు వెల్లడించారు. బరాజ్ కుంగిన విషయం తెలిసిన తరువాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం మంగళవారం బరాజ్‌ను పరిశీలించింది. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నీటి పారుదలశాఖ ఇంజినీర్లతో ఈ బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో బరాజ్ కుంగిన తీరు, పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం ఈఎన్సీ మురళీధర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్ట్ డిజైనింగ్‌లో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. డిజైన్ లోపం ఉంటే మూడు సీజన్ ఎలా తట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు పౌండేషన్ కింద ఇసుక కదలిక వల్ల సమస్య వచ్చిందని భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం అన్ని వివరాలు తెలుసుకున్నదని వివరించారు. కేంద్ర బృందం మరింత సమాచారం అడిగిందని చెప్పారు.
ఎక్కడో చిన్న పొరపాటు అయితే జరిగిందని అంగీకరించారు. 7వ బ్లాక్‌లో సమస్య రావడం వల్ల సెంటర్ పిల్లర్ కుంగిందన్నారు. డిజైన్‌లో లోపం ఉంటే మొదటి ఏడాదే తెలిసేదని చెప్పారు. ఎక్కడ పొరపాటు జరిగిందో అధ్యయనం చేస్తామని తెలిపారు. ఫీల్డ్ వర్క్ చేయించామని, నీటి పారుదల శాఖ ఇంజినీర్లు, ఎల్అండ్‌టీ ఇంజినీర్లు విడివిడిగా అధ్యయనం చేసి, డాటా అంతా క్రోడీకరించి పనులు చేపట్టారని వివరించారు. ఎంత చేసినా వందకు వంద శాతం ఫర్‌ఫెక్ట్ నెస్ అనేది ఉండదని, ఎక్కడో ఒక చిన్న పొరపాటు ఉంటుందని అన్నారు. బరాజ్‌ను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు కొన్ని రికార్డులు అడిగారని, వాటిని అప్పగిస్తామని తెలిపారు. కేంద్ర బృందం త్వరలో రిపోర్ట్ ఇస్తుందన్నారు. ముందు నీళ్లు ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు. నీళ్లు ఖాళీ అయిన తరువాత పైనుంచి వచ్చే నీళ్లను మళ్లించి అక్కడ రెస్టోరేషన్ చేపతామన్నారు. ఈ వేసవి కాలంలో పనులు మొత్తం పూర్తయ్యేలా చేపడతామన్నారు. ఈ మేరకు ఎల్ అండ్ టీ సంస్థ తాము సరిచేస్తామని కూడా చెప్పిందన్నారు.
నవంబర్‌లో పనులు మొదలు
ఈ నెలాఖరు వరకు నీటిని ఖాళీ చేయించి, వచ్చే నీటిని మళ్లించి, నవంబర్ నుంచి మరమ్మతులు చేపట్టడానికి నీటిపారుదలశాఖ సిద్ధమైంది. పిల్లర్ల కింద ఇసుక జారీ పోవడం వల్లనే పిల్లర్ కిందకు కుంగినట్లు ఇంజనీర్లు అభిప్రాయ పడుతున్నారు. ఎలా కుంగింది? ఎన్ని పిల్లర్లకు దెబ్బతగిలింది? బరాజ్‌లో మిగతా పిల్లర్ల కింద పరిస్థితి ఏమిటి? అనేది పూర్తిగా డ్యామ్ ఖాళీచేసిన తరువాతనే తెలుసుకునే వీలు కలుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఇంజినీర్ తెలిపారు. మరమ్మత్తుల ఖర్చు ఎంతవుతుందనేది కూడా అప్పుడే అంచనా వేయగలమని అన్నారు.
కేంద్ర ఎన్నికల కమిటీని కలిసిన కాంగ్రెస్ ప్రతినిధులు
పిల్లర్ కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించేందుకు అనుమతినివ్వాలని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. బుధవారం ఢిల్లీలో ప్రతినిధి బృందం సీఈసీని కలిసింది. మేడిగడ్డ బరాజ్ కుంగడం పైన కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ప్రతినిధులు కోరుతున్నారు. కమిషన్ తో విచారణ చేపట్టే విధంగా ఆదేశాలు జారీచేయాలని ఎన్నికల కమిషన్ ప్రతినిధులను కోరారు. ఎన్నికల కమిటీని కలిసిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీ జై రాం రమేష్ తదితరులు ఉన్నారు.