Chhattisgarh
విధాత: భారత్‌లో ఇప్పటి వరకూ కనివినీ ఎరగని నిరసన ప్రదర్శన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లో చోటుచేసుకుంది. తమ సమస్యను అందరి దృష్టికీ తీసుకువెళ్లాలనుకున్న కొంతమంది వ్యక్తులు నగ్నంగా నిరసన ప్రదర్శన (Nude Protest) కు దిగారు. పలువురు యువకులు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు తన్నుకుపోతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రోడ్లపై నగ్నంగా ర్యాలీగా వెళ్లారు.
రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఈ యువకులంతా రాష్ట్ర అసెంబ్లీ వైపు నినాదాలు చేసుకుంటూ వెళ్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. సుమారు 12 మందికి పైగా యువకులు నగ్నంగా నిరసన చేపట్టడంతో అరెస్టు చేశామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
బాధిత యువకుల్లో ఒకరు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 267 మంది నకిలీ ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించి ఉద్యోగాలు దక్కించుకున్నారని ఆరోపించాడు. వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో నిరాహారదీక్షకు దిగినా.. తమ డిమాండ్లను నెరవేర్చలేదని వాపోయాడు. పోలీసుల సూచనలతో నగ్న నిరసనను నిలిపివేసిన యువకులు.. ప్రభుత్వం తమ ఆక్రందనలు వినకపోతే.. ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చిరించారు