త్వరలో రాష్ట్ర ప్రజలకు హెల్త్ ప్రొఫైల్‌ కార్డులు

రాష్ట్ర ప్రజలకు వచ్చే జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు

త్వరలో రాష్ట్ర ప్రజలకు హెల్త్ ప్రొఫైల్‌ కార్డులు
  • మాజీ ఎమ్మెల్యేలకు ఉచిత మందులు
  • మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి


విధాత : రాష్ట్ర ప్రజలకు వచ్చే జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్‌లో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుకు ఆదివారం సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబము మాట్లాడుతూ ఆధార్ కార్డు సంఖ్య తరహాలో ఒక్కో పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యతో గుర్తింపు కల్పిస్తామని తెలిపారు. పేరు టైప్ చేస్తే సమగ్ర వైద్య సేవల వివరాలు తెలుసుకునేలా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుల జారీకి చర్యలు చేపట్టామన్నారు. ఏ వైద్యుడిని సంప్రదించినా వారి ఆరోగ్య స్థితిగతులను వెంటనే తెలుసుకుని మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.


ఎమర్జెన్సీలో అవసరమైన ట్రీట్ మెంట్ అందించడానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉపయోగడుతుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల క్వార్టర్లలోని డిస్పెన్సరీలతోపాటు అన్ని ఆసుపత్రుల్లో చికిత్సకు అనుగుణంగా ఔషధాలను సరఫరా చేయాలని మంత్రి శ్రీధర్‌ బాబు అధికారులను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యేలు రాజేశంగౌడ్, ఆంజనేయులు, సత్యనారాయణగౌడ్ తదితరులు ఆదివారం మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి ఔషదాల సరఫరాలో కొరతను తీర్చాలని వివరించారు. ఔషధాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు.