యాదవుల పక్షపాతి సీఎం కేసీఆర్: మంత్రి జగదీశ్ రెడ్డి

  • By: Somu    latest    Oct 05, 2023 10:31 AM IST
యాదవుల పక్షపాతి సీఎం కేసీఆర్: మంత్రి జగదీశ్ రెడ్డి
  • లింగమంతుల స్వామి ఆలయ
  • రాజగోపురాల నిర్మాణానికి శంకుస్థాపన


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: యాదవుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. యాదవుల ఆరాధ్య దైవం పెద్దగట్టుపై కొలువై ఉన్న లింగమంతుల స్వామి ఆలయంలో మంత్రి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.50 లక్షలతో చేపట్టబోయే ఆలయ రాజగోపురాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదవుల సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం మాంసం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిపిందన్నారు. గత పాలకులు ఏనాడూ పెద్దగట్టు ఆలయాన్ని పట్టించుకున్నది లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే కోనేరు, గెస్టు హౌజ్, పూజారుల విశ్రాంతి భవనం, కార్యాలయం, విద్యుద్దీకరణ పనులు శాశ్వత ప్రాతిపదికన నిర్మించామని పేర్కొన్నారు.


రెండేళ్లకి ఒకసారి జరిగే జాతర సమయంలో ఏర్పాట్ల కోసం కోట్లాది రూపాయల నిధులను కేటాయించి, వైభవంగా నిర్వహించామని తెలిపారు. త్వరలోనే సూర్యాపేటలో కనీవినీ ఎరుగని రీతిలో యాదవ సంక్షేమ భవన్ నిర్మాణానికి శ్రీకారం చుడదామని పిలుపునిచ్చారు. లింగమంతుల స్వామి వారి ఆశీస్సులు ప్రతిఒక్కరిపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.


కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, సత్యనారాయణ పిళ్లై, కౌన్సిలర్ లక్ష్మీ మకతులాల్, బాషా మియా, బత్తుల జానీ లక్ష్మీ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వైవీ రామగిరి నగేష్, వైస్ ఎంపీపీ జీవన్ రెడ్డి, జిల్లా నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, ఉప్పల ఆనంద్, మాజీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ యాదవ్, కాచం శ్రీనివాస్, జటంగి వెంకటేశ్వర్లు, కాచం రాము, పచ్చిపాల అనిల్, సుంకరి శ్రీనివాస్, గుట్టేటి సైదులు యాదవ్, భీమన్న బీయిన యాదగిరి, మెంతబోయిన నాగయ్య  పాల్గొన్నారు.