ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టుకు తెలంగాణలో ధర్నాలు ఎందుకు
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధమని, ఇక్కడ బీఆరెస్ పార్టీ ఎందుకు ధర్నాలు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు

- చంద్రబాబు అరెస్టుపై ఇక్కడ ధర్నాలు ఎందుకని మీరెందుకు చేస్తున్నారు
- బీఆరెస్ నేతలపై మండిపడిన మంత్రి కోమటిరెడ్డి
విధాత, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధమని, ఇక్కడ బీఆరెస్ పార్టీ ఎందుకు ధర్నాలు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితను లిక్కర్ వ్యాపారం అక్రమాలలో ఈడీ అధికారులు అరెస్టు చేశారని, దానికి తెలంగాణలో ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎందుకన్నారు. గతంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు తెలిపితే బీఆరెస్ పాలకులు అడ్డుకున్నారని గుర్తు చేశారు.
ఆనాడు ధర్నాలు అడ్డుకున్న వారే.. నేడు ధర్నాలు చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఏపీ అంశాలపై హైదరాబాద్‌లో నిరసనలు ఎందుకన్నారని, కానీ ఇప్పుడు కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అంతగా బీఆరెస్ వాళ్లకు అవసరమైతే ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసి బీఆరెస్ కార్యకర్తలను ఢిల్లీకి తీసుకపోయి ఈడీ ఆఫీసు ముందు ధర్నాలు దీక్షలు
చేసుకోండని హితవు పలికారు.
కేసీఆర్ కుటుంబం చేసిన అక్రమాలకు పార్టీలోని అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఎవడొస్తడో రా చూసుకుందాం అని తొడకొట్టి ఇప్పుడు అమాయక కార్యకర్తలను రోడ్లమీదకి తేవడం ఎందుకు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పాలనతో ప్రజల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగులు నిండుతున్నాయని, మళ్లీ మీ కుటిల రాజకీయాలతో తెలంగాణ ప్రజల్ని ఇబ్బందులు పెట్టకండని కోమటిరెడ్డి సూచించారు.
రైతులు కరువుతో అల్లాడి పోతుంటే మీ లిక్కర్ రాజకీయాలకు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలనుకుంటున్నారా ? అని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రితో కుమ్మక్కె రాయలసీమకు నీళ్లివ్వడం మూలంగా ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయాయని ఆరోపించారు.