పేదల అభ్యున్నతికి పనిచేస్తా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
తనను ఆదరించి గెలిపించిన ప్రజల రుణం ఏం చేసినా తీర్చుకోలేమని, అయితే సమాజంలోని పేదల అభ్యున్నతికి సహాయం అందిస్తూ ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా తన ప్రయత్నం చేస్తానని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

- హామీలన్ని అమలు చేస్తాం
విధాత : తనను ఆదరించి గెలిపించిన ప్రజల రుణం ఏం చేసినా తీర్చుకోలేమని, అయితే సమాజంలోని పేదల అభ్యున్నతికి వారికి ఇండ్లు, ఉద్యోగాలు, కష్టకాలంలో అవసరమైన సహాయం అందిస్తూ ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా తన ప్రయత్నం చేస్తానని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా నల్లగొండ పానగల్, పచ్చల సోమేశ్వరాలయాల్లో ఆయన అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి మూడు నెలల్లో 700కోట్ల మేరకు నిధులు మంజూరీ చేయించానిని, తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీని కూడా కలిసి నిధుల కోసం అభ్యర్ధించానని తెలిపారు.
ఆర్ఆర్ఆర్తో పాటు ఇతర రహదారుల విస్తరణకు కేంద్ర నిధుల మంజూరీ కోరడం జరిగిందని వెలల్లడించారు. నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని ఐదేళ్లలో అమలు చేసి మంచి ఎమ్మెల్యేగా మీచేత అనిపించేలా పనిచేస్తానన్నారు. సమాజంలోని మహిళలు అన్ని రంగాలలో ముందుకు వచ్చి అభివృద్ధి చెందాలని, వారికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. తమది మహిళల సంక్షేమం కోరే ప్రభుత్వమని, ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించామని,మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించి ఆలయాలను సందర్శించుకోవడం చాలా సంతోషం కలిగిస్తుందన్నారు.
ఇప్పటికే మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే భద్రాద్రి రామయ్య పాదాల దగ్గర మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నామని, ప్రతి మహిళకు ,మహిళా సంఘాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. త్వరలో మహిళలకు వడ్డీలేని రుణాలు కూడా ఇస్తామని ప్రకటించారు.
ఆధ్యాత్మికపరంగా, ఆర్కియాలజీ పరంగా ప్రత్యేకమైన దేవాలయాలు నల్గొండలోని పచ్చల సోమేశ్వరాలయం ,చాయా సోమేశ్వరాలయాలు విలసిల్లుతున్నాయన్నారు. ఛాయా సోమేశ్వరాలయాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆర్కేయాలజీ నిపుణులు వచ్చి పరిశీలించారన్నారు. అలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఇంతటి మహత్యం కలిగిన ఛాయసోమేశ్వర ఆలయాలలో పూజలు జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు.వచ్చే సంవత్సరం శివరాత్రి నాటికి ఈ ఆలయాలన్ని మరింత అభివృద్ధి చేస్తామని, శివరాత్రి పర్వదినం రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సైతం రావడం చాలా సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆలయ చైర్మన్ సూర మహేష్, స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.