దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయ్.. కోమటిరెడ్డి మంత్రి కేటీఆర్ సవాల్

విధాత, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలని ఎవరికి డిపాజిట్ రాదో తెలుస్తుందని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సోమవారం సూర్యాపేటలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి సహా బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యేలకు డిపాజిట్లు దక్కవన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆయనను తిప్పికొట్టారు. వెంకట్‌రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలని, అప్పుడు ఎవరికి డిపాజిట్ రాదో తెలుస్తుందన్నారు.
సూర్యాపేట నియోజకవర్గానికి మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సేవ, అభివృద్ధికి 50వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పదేపదే 24గంటల విద్యుత్తు సరఫరా కావడం లేదంటున్నారని, ఒకసారి కరెంటు తీగలు పట్టుకుంటే కరెంటు ఉందో లేదో తెలుస్తుందన్నారు. కరెంటు లేక కాంగ్రెస్ హాయంలో అంత్యక్రియలయ్యాక స్నానం చేసేవారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు.
ఆరు దశబ్దాలు పాలించినా ఏమీ చేయకుండా దోచుకున్న కాంగ్రెస్ నేతలు మళ్ళీ ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని మోసం చేసేందుకు చూస్తున్నారన్నారు. వారంటీ లేని గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీవని వాటిని నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవద్దన్నారు.
ఓటుకు నోటు కేసులో దొరికిన నేత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నాడని, అటువంటి వారి మాటలు నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారన్నారు. ప్రధాని మోడీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనేనని, తెలంగాణ ప్రజలంతా మా కుటుంబమేనన్నారు. పాలనలో అద్భుతాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీది వారసత్వ రాజకీయమేనన్నారు. మాది మహాత్మా గాంధీ వారసత్వమైతే మోడీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వమని విమర్శించారు.