కామారెడ్డిని దేశంలోనే నంబర్ వన్ చేస్తాం: మంత్రి కేటీఆర్

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నాడని, ఐదేళ్లలోనే కామారెడ్డిని దేశంలోనే నెంబర్ వన్ చేస్తామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు.

కామారెడ్డిని దేశంలోనే నంబర్ వన్ చేస్తాం: మంత్రి కేటీఆర్
  • చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్
  • దుబాయ్ వెళ్లే కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ
  • బిక్కనూరు సభలో మంత్రి కేటీఆర్


విధాత, నిజామాబాద్: కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నాడని, ఐదేళ్లలోనే కామారెడ్డిని దేశంలోనే నెంబర్ వన్ చేస్తామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలకేంద్రంలో బీఆరెస్ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడారు.


కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి, 14 సంవత్సరాలు ఢిల్లీ గద్దలతో కొట్లాడి తెలంగాణ తీసుకువచ్చాడన్నారు. 65 సంవత్సరాల్లో కాంగ్రెస్, ఇతర పార్టీలు చేయని పనిని కేసీఆర్ తెలంగాణలో చేశాడని చెప్పారు. భూములు అమ్ముకునేందుకే కేసీఆర్ వస్తున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కామారెడ్డిలో ఒక ఇంచు భూమి కూడా పోదని హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములపై పూర్తి అధికారాన్ని ఇస్తామని అన్నారు.


కామారెడ్డిలో గెలిచేది కేసీఆరే.. మీరే తప్పకుండా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గోదావరి జలాలు రావాలి, పరిశ్రమలు రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో గంప గోవర్ధన్ ను సీఎంను కామారెడ్డికి పిలిపించారని చెప్పారు. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లే కుటుంబ సభ్యులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు.