విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం.. ఖాళీల భర్తీ చేపడుతాం: మంత్రి పొంగులేటి

బీఆరెస్ పదేళ్ల పాలనలో విద్యారంగం ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ విద్య వరకు నిర్లక్ష్యానికి గురైందని, తమ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిపెట్టి తిరిగి విద్యారంగం

  • Publish Date - March 10, 2024 / 11:31 AM IST
  • ఉద్యోగ హామీలు నెరవేరుస్తాం
  • సీఎం ఆశల గల్లంతుతో నిరాశలో కవిత : మంత్రి సీతక్క
  • ఇచ్చిన హామీలు అమలు చేస్తాం : మంత్రి కొండా సురేఖ

విధాత : బీఆరెస్ పదేళ్ల పాలనలో విద్యారంగం ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ విద్య వరకు నిర్లక్ష్యానికి గురైందని, తమ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిపెట్టి తిరిగి విద్యారంగం బలోపేతానికి ప్రాధాన్యతనిచ్చి పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పొంగులేటి, మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో కలిసి కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ కూడా నిర్మించలేదని విమర్శించారు. ఉద్యమకాలంలో విద్యార్థులు సాగించిన పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చి విద్యార్యులను, నిరుద్యోగులను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. యూనివర్సిటీల ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతామని, ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగానే 31వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. గ్రూప్ 1నోటిఫికేషన్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చామని తెలిపారు. ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలిచ్చి తీరుతామన్నారు. కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులైజేషన్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెలుతామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వారా ఈ వర్సిటీలో అడుగుపెట్టిన మంత్రులం తామేనని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు దిశగా ముందుకెలుతుందని, సోమవారం భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించబోతున్నారన్నారు.

అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ మహిళలను అన్ని రంగాల్లో ప్రొత్సహిస్తుందన్నారు. బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్నారంటూ వారిని రెచ్చగొడుతు తప్పుదోవ పట్టిస్తు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీఆరెస్ మరోసారి అధికారంలోకి వచ్చివుంటే సీఎం పదవి దక్కించుకోవాలన్న కవిత ఆశలు ఆవిరైపోవడంతో ఆమె నిరాశతో నిత్యం తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే పని పెట్టుకున్నారన్నారు. కవిత రద్దు చేయమంటున్న జీవో 3కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందేనన్నారు. కవిత రాజకీయ జిమ్మిక్కులు మానుకుని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహారించాలని హితవు పలికారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు సహా అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. నిరుద్యోగులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా అమలు చేస్తు ముందుకెలుతుందన్నారు. కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి జిల్లా మంత్రులుగా తాము అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.