ఆర్టీసీ పటిష్టతకు ప్రాధాన్యత: మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఆర్టీసీ పటిష్టతకు, కార్మిక సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఆర్టీసీ పటిష్టతకు ప్రాధాన్యత: మంత్రి పొన్నం ప్రభాకర్‌
  • 80కొత్త బస్సులకు ప్రారంభోత్సవం


విధాత: ఆర్టీసీ పటిష్టతకు, కార్మిక సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైద్రాబాద్ ఎన్‌టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ధ జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేసిన 80బస్సులు(30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్లు)ను ఆయన ఆర్టీసీ ఎండి.సజ్జనార్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.


అనంతరం వారు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వ హాయంలో సంస్థతో పాటు కార్మికులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇకముందు ఆర్టీసీ సంస్థకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. త్వరలో సీసీఎస్ బకాయిలు విడుదల చేస్తామని వెల్లడించారు. ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నన్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.


వీటిలో హైదరాబాద్ కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించనున్నట్లు వివరించారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంతో బస్సుల్లో పెరిగిన రద్ధీని ఎదుర్కోనేందుకు కొత్తగా అత్యాధునిక హంగులతో కొత్త ఎక్స్ ప్రెస్, లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.