Minister Seethakka | ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తుందని మంత్రి ధనసరి సీతక్క అనసూయ స్పష్టం చేశారు

- బీఆరెస్ పాలనలో ప్రజాస్వేచ్చ అణిచివేత
- కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవిపై బీఆరెస్ మోకాలడ్డూ
- మంత్రి సీతక్క ధ్వజం
Minister Seethakka | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్ : ప్రజా సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తుందని, బీఆరెస్ పార్టీ మాదిరిగా అధికారం కోసం కుటిల రాజకీయాలు చేయబోమని ప్రజల ఆకాంక్షల మేరకే నడుచుకుంటామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి ధనసరి సీతక్క అనసూయ స్పష్టం చేశారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తూ మార్గమధ్యలో మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తో కలిసి సీతక్క మీడియాతో మాట్లాడారు.
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన కేసీఆర్ హంగు, ఆర్భాటాలకు పోయి దేశ రాజకీయాలు అంటూ హంగామా చేశాడని విమర్శించారు. ప్రగతిభవన్ , సెక్రటేరియట్ లాంటి సౌదాలు నిర్మించి ఇదే అభివృద్ధి అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. మారుమూల గ్రామాల్లో ,తండాల్లో, ఆదివాసి ప్రాంతాల్లో వారి జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని వారిని పూర్తిగా విస్మరించాడని ఆమె విమర్శించారు. నిరుద్యోగ సమస్యలు నిర్మూలిస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి నిరుద్యోగ యువతను మోసం చేశాడని పేర్కొన్నారు.
కోదండరాం లాంటి ఉద్యమకారునికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎందుకు అక్కసు వెల్లగక్కుతున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాగరహారంలో లక్షలాది మందిని ఏకతాటిపై తీసుకువచ్చి ఆంధ్ర పాలకుల గుండెల్లో దడ పుట్టించింది కోదండరాం కాదా అని ఆమె నిలదీశారు. తెలంగాణ త్యాగధనులను వాడుకొని వదిలిపెట్టే తత్వం బీఆరెస్ పార్టీకి ఉందని ఆమె విమర్శించారు. బీఆరెస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి ఉండేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదవ తేదీలోపే అందరికీ జీతాలు ఖాతాలో పడుతున్నాయని ఆమె తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే తెలంగాణ ఉద్యమకారుల గొంతు నొక్కడంతో పాటు ధర్నా చౌక్ ను ఎత్తివేసిన ఘనత బీఆరెస్‌కే దక్కిందని ఆమె అన్నారు. తెలంగాణ పేరును శాశ్వతంగా రూపుమాపడానికి కేసీఆర్ టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చి చేతులు కాల్చుకున్నాడని ఆమె అన్నారు. తెలంగాణ పేరును కనుమరుగు చేయాలని కుట్ర పన్నిన కేసీఆర్‌కు శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆమె అన్నారు.
జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ రెండు పంటలకు సాగునీరు అందించడంలో గత పాలకులు విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. కడెం ప్రాజెక్టు ఆధునికరణకు నిధులు కేటాయించినట్లు ఆమె తెలిపారు. అలాగే జిల్లాలో నీటి వనరులను సద్వినియోగం చేసుకొని సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. జిల్లాలో ఎక్కువగా రక్తహీనత వ్యాధితో బాధపడుతున్నట్టు తమ పరిశీలనలో వెల్లడైందని, ఇకమీదట అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సంకల్పించినట్లు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు మాట్లాడుతూ ఇంద్రవెల్లిలో శుక్రవారం జరుగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని కోరారు. రేవంత్‌రెడ్డి నాగోబా దేవతను దర్శించుకున్న పిదప ఇంద్రవెళ్లిలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పిస్తారని తెలిపారు. అనంతరం స్మృతి వనంకు అంకురార్పణ చేస్తారని చెప్పారు. మధ్యాహ్నం జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు.
మంచిర్యాల నియోజకవర్గం నుంచి 135 బస్సులు, కార్లలో జనం తరలివస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌కు మంచి సెంటిమెంట్ గా మారిందన్నారు. గతంలో ఇంద్రవెల్లి నుంచి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించారని అన్నారు. మళ్లీ శుక్రవారం ఇంద్రవెల్లి సభతో పార్లమెంట్ ఎన్నికలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. అలాగే భట్టి విక్రమార్క పాదయాత్ర , జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తొలి సభ మంచిర్యాలలోనే జరిగినట్లు ఆయన గుర్తుచేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు సామూహిక భీమా పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు భీమా సంస్థలతో సంప్రదింపులు జరిపామని ఆ సంస్థ కార్యాలయాలు మంచిర్యాలకు తరలిరానున్నట్లు చెప్పారు. ఈనెల పదవ తేదీ తర్వాత భీమా పథకం ప్రక్రియ ఆరంభమవుతుందని ఒక్కొక్కరికి 15లక్షల భీమా, ప్రయాణీకులకు రెండు లక్షలు వర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈసమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.