మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి: మంత్రి సీతక్క

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని మంత్రి సీతక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు

  • By: Somu    latest    Dec 23, 2023 12:28 PM IST
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి: మంత్రి సీతక్క
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి సీతక్క వినతి
  • సీతక్కకు చీర బహుకరించిన రాష్ట్రపతి


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గిరిజన జాతర అయిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించేందుకు సహకరించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క వినతిపత్రం అందించారు.


రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని శనివారం ఆమె మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. రెండు సంవత్సరాలకు ఒకసారి తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరుగు సమ్మక్క-సారలమ్మ తల్లుల గిరిజన జాతర ఆసియా ఖండంలోనే జరిగే అతిపెద్ద గిరిజన జాతర అని వివరించారు.


ఈ గిరిజన జాతరకు దేశం నలుమూలల నుండి కోటిన్నరకు పైగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారని, అలాంటి గిరిజన జాతర అయిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. అలాగే సమ్మక్క-సారలమ్మ తల్లుల చిత్రపటాన్ని అందించారు. కరోనా సమయంలో సీతక్క సేవలకు గుర్తుగా రాష్ట్రపతి సీతక్కకు చీరను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ పాల్గొన్నారు.