ఇరిగేషన్ లోన్లు కేసీఆర్‌, కేటీఆర్ కట్టాలి: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి, డీజైన్‌..నిర్మాణం..నిర్వాహణ లోపాలకు బాధ్యత తీసుకుని మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లు ఇరిగేషన్ రుణాలు కట్టాలని ఇరిగేషన్ శాఖ మంత్రి

  • Publish Date - March 1, 2024 / 12:13 PM IST

  • విజిలెన్స్ నివేదికపై చట్టపర చర్యలు
  • బీజేపీ-బీఆరెస్ ఒక్కటైనందుకే లక్ష కోట్ల రుణాలు
  • బీఆరెస్‌ పాపాల్లో కేంద్రం పాత్ర కూడా ఉంది
  • కేంద్రం అడిగిన వివరాలన్ని ఇచ్చాం
  • ఎన్డీఎస్‌ఏ కమిటీని స్వాగతిస్తున్నాం
  • సాగర్ డ్యాం నిర్వాహణ చూస్తాం…కేంద్ర బలగాలు తొలగించాలి

విధాత : ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి, డీజైన్‌..నిర్మాణం..నిర్వాహణ లోపాలకు బాధ్యత తీసుకుని మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లు ఇరిగేషన్ రుణాలు కట్టాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ రిపోర్టు నెలరోజుల్లో వస్తదని, రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందిస్తామన్నారు. విజిలెన్స్ ప్రాథమిక నివేదిక అందిందని న్యాయ సలహా తీసుకుని చట్టపర చర్యలు తీసుకుంటామన్నారు. మేడిగడ్డ కట్టింది ఎల్‌ఆండ్‌టీ సంస్థనే అని, వేరే సబ్ కాంట్రాక్టు కట్టినట్లు పేపర్ రికార్డు లేదన్నారు. మేడిగడ్డ కట్టిన ఎల్‌ఆండ్‌టీ సంస్థకు 4వందల కోట్లు పెండింగ్ నిధులు ఆపామని వెల్లడించారు. మా మ్యానిఫెస్టోలో తుమ్మిడిహేట్టి ఉందని, ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్ కు తుమ్మిడిహెట్టికి సంబంధం లేదన్నారు. తుమ్మీదిహెట్టి వద్ద నీళ్ళు లేవని సీడబ్ల్యుసీ చెప్పినట్లు బీఆరెస్‌ తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. తుమ్మిడిహెట్టీ వద్ద 160 టీఎంసీ వద్ద ఉన్నాయని సీడబ్ల్యుసీ రిపోర్ట్ ఇచ్చినట్లు కేంద్ర ఇరిగేషన్ అధికారి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టుకు అదనపు నిధులు ఖర్చు చేసి ఉంటే 16లక్షల ఆయకట్టుకు ఇప్పటికే నీళ్ళు అందేవని చెప్పారు. ప్రాణహిత కోసం వేదిరె శ్రీరామ్ చెప్పిన 11వేల కోట్లలో 6వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. వైఎస్సార్‌ పాలనలో బీఆరెస్‌ అంబేద్కర్‌ ప్రాణహిత చేవెళ్ల ప్రారంభించామని, కొత్త ఆయకట్టుతో ఆనాడు 30వేల కోట్లతో పనులు ప్రారంభించి కొన్ని పనులు పూర్తి చేశామని వివరించారు. ప్రాణహిత-చేవెళ్లను పూర్తి చేస్తే కాంగ్రెస్‌కే క్రెడిట్‌ వస్తుందనే కుట్రతో కేసీఆర్‌ రీడిజైన్‌ చేసి కాళేశ్వరంతో కమిషన్ల దందా సాగించారని విమర్శించారు. నాగార్జున సాగర్ మెంటెనేన్స్ మేం చేస్తామని, అక్కడి నుంచి సీఆర్పీఎఫ్‌ బలగాలు తొలగించాలని కోరామని చెప్పారు.

బీఆరెస్‌ పాపాల్లో కేంద్రం పాత్ర

బీఆరెస్ చేసిన పాపాల్లో కేంద్రం పాత్ర ఉందని ఉత్తమ్‌ ఆరోపించారు. కేంద్రం హామీతోనే వేల కోట్ల రుణాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చాయన్నారు. బీఆరెస్‌-బీజేపీల మధ్య అలయబలయ్ లేకపోతే 1లక్ష కోట్ల రుణాలు ఊరికే వస్తాయా? అని ప్రశ్నించారు.

మేం పోతే ఏం పీకనీకి పోయారన్నారు..వారేందుకు పోయారు

మేడిగడ్డ బ్యారేజీకి సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేల బృందం వెళితే మాజీ సీఎం కేసీఆర్‌ మమ్మల్ని ఏముంది అక్కడ.. బొందలగడ్డ.. ఏం పీకనీకి పోయినారని విమర్శించాడని, ఇప్పుడు ఆయన కొడుకు కేటీఆర్‌ బీఆరెస్‌ బృందం మేడిగడ్డకు ఎందుకు పోయారు..ఏం చెద్దామని వెళ్లారని నిలదీశారు. మేడిగడ్డ వెళ్లిన బీఆరెస్‌ నేతలు కుంగిన బ్యారేజీని చూసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ విషయంలో బీఆరెస్‌ తీరు హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బీఆరెస్‌ కాళేశ్వరం డిజైన్, ప్లానింగ్, నిర్మాణంలో చాలా మేజర్ పొరపాట్లు చేసిందని, బీఆరెస్‌ నేతలు కమీషన్లకు కక్కుర్తి పడి తెలంగాణ రైతుల భవిష్యత్తును ఫణింగా పెట్టారని మండిపడ్డారు. మేడిగడ్డ వెళ్తున్న బీఆరెస్‌ నేతల బస్సు టైర్ బ్లాస్ట్ అయిందని, ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కారు షెడ్డుకు పోయిందని, తిరిగి బాగయ్యే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.

ఎన్డీఎస్‌ఏ కమిటీని స్వాగతిస్తున్నాం

మేడిగడ్డ విచారణ కేంద్ర జలశక్తి శాఖ ఎన్డీఎస్‌ఏ పై కమిటీ వేయడాన్ని మేం స్వాగతిస్తున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎన్డీఎస్‌ఏ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, ఆ కమిటీ సూచనలు కేటీఆర్ సలహాలకంటే కీలకమైనవని వ్యాఖ్యానించారు. ఎన్డీఎస్‌ఏ కమిటీ ఏర్పాటును కోరిందే రాష్ట్ర ప్రభుత్వమని, కమిటీకి మా దగ్గర ఉన్న సమాచారం అంతా ఇస్తామని, విచారణకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. రేపు తాను ఢిల్లీ వెళ్తున్నానని, మేడిగడ్డ అంశంపై పలువురు నిపుణులను, అధికారులను కలుస్తానని వారితో చర్చిస్తానని తెలిపారు. మేము సమాచారం, డాక్యుమెంట్స్ ఇవ్వలేదని కేంద్ర జల శక్తి సలహాదారు వేదిరే శ్రీరామ్ చెప్పడం అవాస్తవమన్నారు. మేము ఇవ్వని వాటిలో జియోజికల్ ప్రొఫైల్ ఒకటని, అది గత ప్రభుత్వం చెయ్యలేదని, అందుకే తాము ఇవ్వలేదని చెప్పారు. క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్ మరొకటని మేము అధికారంలోకి వచ్చే వరకు ఏమీలేవన్ మేము వచ్చాక చేసినవి ఇచ్చామని తెలిపారు. థర్డ్ పార్టీ రిపోర్ట్స్ ఇవ్వలేదన్నారని, అవి లేవు కాబట్టే ఇవ్వలేదన్నారు. కంప్లిషన్ రిపోర్ట్స్ ఇవ్వలేదని శ్రీరామ్‌ చెప్పారని..అందులో సమస్యలు ఉన్నాయనే…విజిలెన్స్ విచారణ జరిగిందని వివరించారు.

Latest News