ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి: ఈటల రాజేందర్‌

పదేళ్ల బీఆరెస్ దుర్మార్గపు పాలనను చూశామని, ఇప్పుడు కాంగ్రెస్ హామీల అమలులో మోసపూరిత పాలన చూస్తున్నామని ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పేలా పట్టభద్రుల

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి: ఈటల రాజేందర్‌

విధాత, హైదరాబాద్: పదేళ్ల బీఆరెస్ దుర్మార్గపు పాలనను చూశామని, ఇప్పుడు కాంగ్రెస్ హామీల అమలులో మోసపూరిత పాలన చూస్తున్నామని ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పేలా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ కోరారు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో ఈటల మాట్లాడారు.

40 ఏళ్లుగా సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమెందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో నిలిపామని నిబద్దతకు మారుపేరుగా ఉన్న ఆయనను గెలిపించాలని కోరారు. జీవో నెంబర్ 317 విషయంలో కేసీఆర్‌ను తప్పు పట్టామని.. నేడు కాంగ్రెస్ పాలనలోనూ ఉద్యోగుల మీద లాఠీ ఛార్జ్ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రభుత్వం అతికొద్ది కాలంలోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ప్రభుత్వమని విమర్శించారు.

ప్రతి నెలా ప్రతి మహిళకు 8 వేల భృతి ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదన్నారు. సోనియా గాంధీ , రాహుల్ గాంధీలతో చెప్పించిన నిరుద్యోగ యువతకు 4 వేలు ఇస్తా అన్న హామీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆనాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించినా నేటికీ అమలు చేయకపోవడం పట్ల ఉద్యోగులు బాధతో ఉన్నారన్నారు. మళ్ళీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈహెచ్ఎస్ కింద ఉన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. మంత్రులు స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలతో సమావేశాలు పెట్టి ఓట్లు వేయాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో అండగా ఉన్నవారికి జీతాలు ఇవ్వకుండా ఉండటం సమంజసం కాదన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్‌ పార్టీకి మనుగడ లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యపై అయిన కొట్లాడే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. అందుకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈటెల రాజేందర్ కోరారు.