కాళేశ్వ‌రంపై విచార‌ణ‌కు ఆదేశిస్తాం: మంత్రి ఉత్త‌మ్

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తామ‌ని నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి తెలిపారు

  • By: Somu    latest    Dec 11, 2023 12:23 PM IST
కాళేశ్వ‌రంపై విచార‌ణ‌కు ఆదేశిస్తాం: మంత్రి ఉత్త‌మ్
  • పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం
  • ఎస్ ఎల్‌బీసీ పూర్తి చేయ‌డంపై క్యాబినెట్‌లో చ‌ర్చిస్తాం
  • ప్ర‌జ‌ల డ‌బ్బుల‌తో జ‌రిగే ప‌నుల్లో గోప్య‌త ఉండ‌దు
  • పూర్తి వివ‌రాలు ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించా
  • నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి


విధాత‌, హైద‌రాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తామ‌ని నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి తెలిపారు. సోమ‌వారం జ‌ల‌సౌధ‌లో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టు లపై అధికారుల‌తో సుధీర్ఘంగా స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. నీటివాటాల అంశంపై కేంద్రంతో చర్చిస్తామ‌న్నారు. కుంగుబాటుకు గురైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సందర్శనకు అధికారులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.


పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు లను పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. 40వేల చెరువుల నిర్వహణ గురించి మా ప్రభుత్వం శ్రద్ద వస్తుందన్నారు. అన్ని ఆరోపణలపై విచారణ చేస్తామ‌న్నారు. ప్రజల డబ్బుతో జరిగే పనుల్లో ఎలాంటి గోప్యత ఉండద‌న్నారు. ప్రాజెక్ట్‌ల‌న్నింటి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారుల‌ను ఆదేశించాన‌న్నారు. రాష్ట్ర అభివృద్ధిలో నీటిపారుదల శాఖది కీలక పాత్ర అని అన్నారు.


ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో ఎవ్వ‌రు డిజైన్ చేశారో, ఎవ్వ‌రు నిర్మాణం చేశారో వారంద‌రినీ బాధ్యుల‌ను చే యాల్సి ఉంటుంద‌న్నారు. అలాగే నిర్మించిన కొత్త ప్రాజెక్ట్ లు, కొత్త‌గా వ‌చ్చిన ఆయ‌క‌ట్టు వివ‌రాల‌న్నీ ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించాన‌ని మంత్రి తెలిపారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణం, నిర్వ‌హ‌ణ అంతా కోట్లాది ప్రజల‌ విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశమ‌ని ఇదంతా పారదర్శకంగా ఉంటుందన్నారు. ప్రాజెక్టులకు అవుతున్న విద్యుత్ వినియోగంపై మంత్రి అధికారుల‌ను ప్ర‌త్యేకంగా వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.


తుమ్మడిహట్టి వ‌ద్ద‌ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి ముఖ్యమంత్రి తో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్ ఎల్ బి సి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ఎంత అవసరమో ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రి తో చర్చించి, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నామ‌ని, మనం పూర్తిగా బాధ్యత యుతంగా, జవాబు దారి తనంతో పని చేయాలన్నారు.


తెలంగాణ లో నీటి పారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉందని, దీన్ని గుర్తు పెట్టుకొని మనం పని చేయాలని ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి అధికారుల‌కు హిత‌బోధ చేశారు. నీటి పారుదల పనులలో మూడో పార్టీ చెక్ ఉండాన్నారు. ప్రజల్లో నీటి పారుదల రంగంపై ఉన్న అపోహలు తొలగిపోయేలా పని చేయాలని అధికారుల‌ను ఆయ‌న కోరారు. ఈస‌మీక్ష స‌మావేశంలో ఈఎన్సీ మురళీధర్‌ తో పాటు ఉన్నతాధికారులు, ఇంజ‌నీర్లు పాల్గొన్నారు.