శాఖల ఆర్ధిక స్థితి అధ్వాన్నం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

- 56 వేల కోట్ల నష్టాల్లో పౌరసరఫరాల శాఖ
- రేషన్ కార్డులపై పరిశీలన
- పౌరసరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
విధాత: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల ఆర్దిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, పౌరసరఫరాల శాఖ 56వేల కోట్ల నష్టాల్లో ఉందని మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన పౌరసరఫరాల శాఖ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలన రంగంలో పౌరసరఫరాల శాఖ ముఖ్యమైన శాఖ అన్నారు. రైతుల నుంచి ధాన్యం ప్రోక్యూర్మెంట్ చేసే శాఖగా, ప్రజలకు ఆహార సరఫరాలోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో 2కోట్ల 80 లక్షల మంది రేషన్ లబ్ధిదారులున్నారు. గ్యాస్ సిలిండర్ 500, ప్యాడి ప్రోక్యూర్మెంట్ లో 500 పెంపుదలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు.
క్వాలిటీ రేషన్ సప్లై చేయాల్సివుందని, 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుందని, రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాల్సివుందన్నారు. ఇప్పటి వరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బీఆరెస్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందన్నారు. లబ్ధిదారుల నుంచి పీడీఎస్ రైస్ డైవర్ట్ అయ్యిందని, లబ్ధిదారులకు తినగలిగే రైస్ ఇవ్వాలని, దీనిపై కమిషనర్ మళ్ళీ సమీక్ష చేయాలన్నారు. ప్రోక్యూర్మెంట్ కు సివిల్ సప్లై అన్ని చర్యలు తీసుకోవాలని, రైతులకు డబ్బులు వెంటనే అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.
గత ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు ఆర్థిక శాఖకు సహాయం చేయక పోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్‌కు సంబంధించి 90 లక్షల మెట్రిక్ టన్నుల 8వేల కోట్ల విలువైన ప్యాడి రైస్ మిల్లర్ల వద్ద ఉందని, దీనిపై ఏం చేయాలనేది క్యాబినెట్ లో చర్చిస్తామన్నారు. 1.17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లై వద్ద ఉందని, 11వేల కోట్ల నష్టాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ ఉందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆరెస్ పాలనలో లోపాలు ఉన్నాయని, 12శాతం మంది రేషన్ తీసుకోవడం లేదన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ ఉందని, సీఎం దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్తానన్నారు.