పోలీసులపై ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరుల వీరంగం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు పోలీసులపై వీరంగం సృష్టించారు. ఏకంగా హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పై దాడి చేశారు

- హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పై దాడి
- ద్విచక్ర వాహనం ధ్వంసం
- గ్రామస్థుల అండతో బయటపడిన వైనం
- బీఆర్ఎస్ అరాచకానికి పరాకాష్ట
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు పోలీసులపై వీరంగం సృష్టించారు. ఏకంగా హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పై దాడి చేశారు. ఘటన కన్నేపల్లి మండలం వీరుపూర్ లో చోటుచేసుకుంది. తమ ఇంట్లో బీఆర్ఎస్ నాయకులు చొరబడి దొంగతనానికి పాల్పడి, తమపై దాడి చేస్తున్నారని.. మమ్ముల్ని కాపాడాలని గ్రామానికి చెందిన ఎల్లాకుల మల్లయ్య డయల్ 100కు ఫోన్ ద్వారా ఘటనను పోలీసులకు చేరవేశాడు.
వెంటనే స్పందించిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ గ్రామానికి చేరుకున్నారు. మల్లయ్యపై దాడికి పాల్పడుతున్న సర్పంచ్ జిల్లాల అశోక్, అతని కొడుకు మహేష్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ తో పాటు కానిస్టేబుల్ తులసీరాంపై సర్పంచు అనుచరులు, అతని కొడుకు దాడి చేశారు. పోలీసుల చేతిలో ఉన్న ట్యాబ్ లాక్కొన్నారు. వారి ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు.
ఘటనపై వీరాపూర్ సర్పంచ్ అశోక్ గౌడ్, అతని కుమారుడు మహేష్, అనుచరులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాడికి గురైన పోలీసులు మాట్లాడుతూ బాధితుని ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్లామని చెప్పారు. మల్లయ్యపై దాడి చేస్తుండగా అడ్డుకున్నామని, అంతలోనే అశోక్ గౌడ్, అతని కొడుకు మహేష్, అనుచరులు మమ్మల్ని కిందపడేసి తొక్కి దాడి చేశారని, నానా బూతులు తిట్టారని తెలిపారు.
మా ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు మమ్ముల ఎవరు ఏం పీకాలేరని.. నోటికి వచ్చినట్లు మాట్లాడారని, పోలీసు అంటే కుక్కలని, బిచ్చగాళ్ళని, ఇష్టారీతిన నోరు పారేసుకున్నట్లు పేర్కొన్నారు. స్థానికుల అండతో తాము అక్కడి నుండి బయటపడ్డామని బాధిత పోలీసులు తెలిపారు.