ఒక్కనాడు జై తెలంగాణ అనని వ్యక్తి నేడు సీఎం అయ్యాడు
ఒక్కనాడు జై తెలంగాణ అనని వ్యక్తి.. ఉద్యమ కారులపైకి తుపాకి ఎక్కు పెట్టిన వ్యక్తి, అమరవీరులకు నివాళులు అర్పించని వ్యక్తి నేడు తెలంగాణకు సీఎం అయ్యాడని మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్ధేశించి మరోసారి ఘాటు విమర్శలు చేశారు.

- కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకే మేడిగడ్డపై రేవంత్ ప్రభుత్వం కుట్ర
- గల్లీలోనైనా.. ఢిల్లీలోనైనా తెలంగాణ హక్కులపై గొంతెత్తి పోరాడేది బీఆరెస్ మాత్రమే
- మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు
విధాత, హైదరాబాద్ : ఒక్కనాడు జై తెలంగాణ అనని వ్యక్తి.. ఉద్యమ కారులపైకి తుపాకి ఎక్కు పెట్టిన వ్యక్తి, అమరవీరులకు నివాళులు అర్పించని వ్యక్తి నేడు తెలంగాణకు సీఎం అయ్యాడని మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్ధేశించి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ బీఆరెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మలిదశ తెలంగాణ పోరాటంలో షాద్‌నగర్ ప్రజలు ఉద్యమ స్ఫూర్తిని చాటారని ప్రశంసించారు.
బీఆరెస్ అధినేత కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ఉద్యమంలో ముందునిలిచి పోరాడారని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. కానీ నేడు తెలంగాణ ఉద్యమ కారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి సీఎంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల తరఫున కొట్లాడుదామన్నారు. బీఆరెస్ పార్టీనే తెలంగాణకు రక్ష అని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆరెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలు ఇచ్చి.. తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. బీఆరెస్ ఎంపీలు పార్లమెంటులో ఉంటేనే మన సమస్యల గురించి పోరాటం చేస్తారన్నారు. తెలంగాణ హక్కుల కోసం గల్లీలో అయినా ఢిల్లీలో అయినా గొంతెత్తి పోరాడేది బీఆరెస్ మాత్రమేనన్నారు.
కేసీఆర్ చేసిన మంచి పనుల ఆనవాళ్లు లేకుండా చేసేందుకే మేడిగడ్డపై రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. పాలమూరు రంగారెడ్డికి కావాల్సిన అనుమతులు అన్ని తెచ్చి.. పంప్ హౌజ్‌లు, సబ్ స్టేషన్లు, టన్నెల్లు, రిజర్వాయర్లు అన్ని పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కాలువలు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.