Komatireddy Rajagopal Reddy | పార్లమెంటు ఎన్నికల అనంతరం బీఆరెస్ కనుమరుగు

పార్లమెంటు ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీఆరెస్ కనుమరుగవుతుందని, ఆ పార్టీ మునిగిపోయే నావ అని ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

Komatireddy Rajagopal Reddy | పార్లమెంటు ఎన్నికల అనంతరం బీఆరెస్ కనుమరుగు

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయం
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

విధాత : పార్లమెంటు ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీఆరెస్ కనుమరుగవుతుందని, ఆ పార్టీ మునిగిపోయే నావ అని ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్‌ల నిర్మాణంలో 10వేల కోట్ల స్కామ్ జరిగిందని, ఇందులో జిల్లా మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వెయ్యి కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. దీనిపై విచారణ జరుగుతుందని, కవిత మాదిరిగానే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ అవినీతికి పాల్పడితే పదేళ్లు అధికారంలోకి ఉండి ఎందుకు నిరూపించలేదన్నారు. అధికారంలోకి రాకముందు మా ఆస్తులేమిటో…జగదీశ్‌రెడ్డి ఆస్తులేమిటో అందరికి తెలుసన్నారు. బీఆరెస్ నేతల అవినీతితోనే రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు సుస్థిరంగా ఉంటుందని దీమా వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం పడిపోతుందన్న కేసీఆర్ బీఆరెస్ నేతల వ్యాఖ్యల్లో నిజం లేదని, బీఆరెస్‌లో ఉన్న ఎమ్మెల్యేలంతా పార్లమెంటు ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో చేరుతారని జోస్యం చెప్పారు.

భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ విజయం ఖాయమని, నల్లగొండ కంటే ఎక్కువ మెజార్టీ రావచ్చన్నారు. గతంలో నేను, నా సోదరుడు వెంకట్‌రెడ్డి ఎంపీలుగా చేసిన అభివృద్ధి కాంగ్రెస్ విజయానికి దోహదం చేస్తుందన్నారు. బీఆరెస్‌లోనే ఇప్పుడు ఎక్కువ గ్రూపులున్నాయని, హరీశ్‌రావు, కేటీఆర్ తలో గ్రూప్‌గా వ్యవహారిస్తున్నారన్నారు. హరీశ్‌రావు ఇప్పటికే హోంశాఖ మంత్రి అమిత్‌షాతో మాట్లాడుకుని తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.