పార్టీ మారను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: మల్లారెడ్డి
తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తాను బీఆరెస్‌లోనే కొనసాగుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు

విధాత, హైదరాబాద్ : తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తాను బీఆరెస్‌లోనే కొనసాగుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే.శివకుమార్‌ను కేవలం వ్యాపార పనుల నిమిత్తం కలిశానని, దీంతో తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా ప్రచారం చోటుచేసుకుందన్నారు. వ్యాపార పనుల కోసమే తాను శివకుమార్‌తో భేటీ కావడం జరిగిందని స్పష్టం చేశారు. తాను పార్టీ మారబోనని, నా వయసు 75ఏండ్లని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్లా రెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కొడుకు భద్రారెడ్డిలు కలిశారు. బీఆరెస్‌కు చెందిన వారంతా డీకే శివకుమార్‌తో భేటీ కావడంతో వారంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నారా అన్న ప్రచారానికి తెరలేసింది. ఇప్పటికే వారు సీఎం సలహాదారు వేంరెడ్డి నరేందర్‌రెడ్డితో భేటీ కావడం జరిగింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మల్లారెడ్డి ఆక్రమ కట్టడాలు, భూ ఆక్రమణలపై వరుస చర్యలకు ఉపక్రమించడంతో మల్లారెడ్డి తన ఆస్తులను, వ్యాపారాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌లో చేరవచ్చన్న ప్రచారం వినిపిస్తున్నది. అయితే ఆయన మాత్రం తాను పార్టీ మారడం లేదంటూ ప్రకటించడం గమనార్హం.