పార్టీ నిర్ణయం మేరకే బీజేఎల్పీ నేత ఎంపిక: ఎమ్మెల్యే రాజాసింగ్‌

అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుందని, మంచి వ్యక్తికే ఆ బాధ్యతలను అప్పగిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు

  • By: Somu    latest    Dec 14, 2023 11:06 AM IST
పార్టీ నిర్ణయం మేరకే బీజేఎల్పీ నేత ఎంపిక: ఎమ్మెల్యే రాజాసింగ్‌
  • పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా
  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌


విధాత: అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుందని, మంచి వ్యక్తికే ఆ బాధ్యతలను అప్పగిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఎమ్మెల్యేలుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రమాణం చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాజాసింగ్ మాట్లాడుతూ మా పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరు ఫ్లోర్ లీడర్ అయినా 8 మంది ఎమ్మెల్యేలంతా కలిసిమెలిసి పనిచేస్తామన్నారు. ప్రొటెం స్పీకర్ ముందు ప్రమాణం చేయమని, పూర్తి స్థాయి స్పీకర్ ముందు చేస్తామని చెప్పి అదే విధంగా ప్రమాణం చేశామన్నారు.


రాష్ట్రంలో బీఆరెస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎంలు మూడు పార్టీలు ఒక్కటేనన్నారు. ఇందుకు ప్రొటెం స్పీకర్ ఎన్నిక కూడా నిదర్శనమన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తాని రాజా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వేశారన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలన్నారు. హామీల అమలుకు నిధులు ఇటలీ నుండి తెస్తారా? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి తెస్తారా చెప్పాలన్నారు.


అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుంది మంచి వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పగిస్తుందన్నారు. నేను ప్రభుత్వాన్ని కూలగొడతా నని అనలేదన్నారు. ఆ పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని, వాళ్లలో వారే కాలు లాగేసుకుంటారని చెప్పానని, కేసులు పెడితే వాళ్లపైనే పెట్టుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్‌ను స్టడీ సర్కిల్‌గా మారుస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. రైతు బంధులో కోత విధించడం సరైంది కాదన్నారు.

 

ప్రమాణం స్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు


తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు తాము కోరుకున్నట్లుగా శాసన సభ పూర్తి స్థాయి స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు శాసన సభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్ధిన్ ఎంపికను నిరసిస్తూ ఆయన ముందు ప్రమాణాన్ని బహిష్కరించారు. పూర్తి స్థాయి స్పీకర్ ముందు మాత్రమే ప్రమాణం చేస్తామని ప్రకటించారు. గురువారం స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎన్నికయ్యాక ఆయన సమక్షంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.


నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.