ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌.. మరోసారి తోసిపుచ్చిన హైకోర్టు

విధాత‌: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్ట్ నిరాక‌రించింది. గతంలో అనంతబాబు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయగా ధర్మాసనం కొట్టివేసింది. పోలీసులు 90 రోజుల్లో చార్జ్‌షిట్ వేయనందున బెయిల్ ఇవ్వాలని హైకోర్టును వైసీపీ ఎమ్మెల్సీ కోరారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. బాధితుల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. […]

  • By: Somu    latest    Oct 12, 2022 10:35 AM IST
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌.. మరోసారి తోసిపుచ్చిన హైకోర్టు

విధాత‌: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్ట్ నిరాక‌రించింది. గతంలో అనంతబాబు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయగా ధర్మాసనం కొట్టివేసింది. పోలీసులు 90 రోజుల్లో చార్జ్‌షిట్ వేయనందున బెయిల్ ఇవ్వాలని హైకోర్టును వైసీపీ ఎమ్మెల్సీ కోరారు.

బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. బాధితుల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కాగా దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి అనంతబాబు రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కోర్టులో మూడు సార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

కాగా.. మే నెల 19న రాత్రి కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎమ్మెల్సీ ప్రయత్నం చేశారు. మే 20న తెల్లవారుజామున ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులోనే సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడంతో అనుమానాలు వచ్చాయి. ఎమ్మెల్సీ తమను బెదిరించారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు.

ఆ తర్వాత అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేయగా.. సుబ్రహ్మణ్యంను హత్య చేసింది తానేనంటూ ప్రాథమికంగా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.

అయితే పోలీసులు ఈ కేసు విషయంలో ఎలాంటి దర్యాప్తు చేయలేదు. కేవలం ఎమ్మెల్సీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు నమోదు చేశారు. ఇంత వరకూ చార్జిషీటు కూడా దాఖలు చేయలేదు. అదే సమయంలో ఎమ్మెల్సీపై పలు కేసులు ఉన్నప్పటికీ .. ఆయనకు గతంలో నేర చరిత్ర లేదనే నివేదికను కోర్టుకు సమర్పించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీకి బెయిల్ నిరాకరించడంతో సుబ్రహ్మణ్యం బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించేలా న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.