20% మధ్యంతర భృతి ఇవ్వాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  • By: Somu    latest    Oct 03, 2023 11:49 AM IST
20% మధ్యంతర భృతి ఇవ్వాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • 370 జీవోతో ఉద్యోగులకు అన్యాయం
  • ఓపీఎస్ పునరుద్ధరణలో మీనమేషాలు
  • అంగట్లో సరుకుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్
  • ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి


విధాత బ్యూరో, కరీంనగర్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 20 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గులాబీ నేతలు తమ పార్టీ పేరునే కాదు.. ఉద్యమ ఆకాంక్షలను విస్మరించారని ఆరోపించారు. ఏ ఆకాంక్షలు, లక్ష్యాల కోసం తెలంగాణ సాధించుకున్నామో, వాటన్నింటినీ నిర్వీర్యం చేశారని విమర్శించారు.


రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణ కోసం కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఆ కమిటీ నివేదిక వచ్చేంత వరకు ఐదు శాతం మధ్యంతర భృతి ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2008లో 22%, 2013లో 27% మధ్యంతర భృతి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపుధోరణి అవలంభిస్తున్నదని విమర్శించారు.


కనీసం 20 శాతం మధ్యంతర భృతి ప్రకటిస్తారని ఉద్యోగ వర్గాలు ఆసక్తితో ఎదురుచూసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీలు నిలిచిపోయాయని, అదనపు ఉద్యోగాల సృష్టి లేకుండా పోయిందని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో ఇదేవిధంగా తయారైందని తెలిపారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగట్లో అమ్మే సరుకుగా మారిపోయిందని మండిపడ్డారు.


ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, 370 జీవో అమలులోనూ ప్రభుత్వ నిష్క్రియా ప్రయత్నం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓల్డ్ పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తామని, 370 జీవో పునః పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.ప్రస్తుత పీఆర్సీ కమిటీ నివేదిక ఇచ్చేంతవరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కనీసం 20 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.