ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హాస్టళ్లలో సమస్యలు

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సంక్షేమ హాస్టళ్లలు సమస్యల నిలయాలుగా మారాయని, విద్యార్థుల ఆత్మహత్యలకు, ఘర్షణకు చివరకు హత్యకు కూడా కేంద్రంగా మారాయని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు

  • By: Somu    latest    Mar 05, 2024 11:09 AM IST
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హాస్టళ్లలో సమస్యలు
  • బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
  • ఆరెస్‌ఎస్ నేపథ్యంతోనే మోదీకి సీఎం రేవంత్‌ భజన
  • ఎమ్మెల్సీ కవిత ఫైర్‌


విధాత, హైదరాబాద్‌ : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సంక్షేమ హాస్టళ్లలు సమస్యల నిలయాలుగా మారాయని, విద్యార్థుల ఆత్మహత్యలకు, ఘర్షణకు చివరకు హత్యకు కూడా కేంద్రంగా మారాయని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం బోధన్ హాస్టల్‌లో జరిగిన ఘర్షణలో ఇంటర్ విద్యార్థుల దాడిలో మృతి చెందిన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామానికి చెందిన హర్యల వెంకట్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.


అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతు హాస్టల్ వార్డెన్, వాచ్‌మెన్ లేకపోవడం వలన జరిగిన చిన్న సంఘటనలో ఒకరు చనిపోగా, ఎనిమిది మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైందని, దీంతో ఎనిమిది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని, ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని క‌విత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యల వల్లనే ఈ సంఘటన జరిగిందని దుయ్యబట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.


రేవంత్‌రెడ్డి పొద్దున లేస్తే కేసీఆర్‌పై పడి ఏడ్చుడే తప్ప ఈ మూడు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూశామంటే, మళ్ళీ గత మూడు నెలల నుంచి చూస్తూనే ఉన్నామ‌ని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్యా శాఖకు మంత్రి లేకపోవడం మన దురదృష్టమన్నారు. మృతుని తల్లికి పెన్షన్, సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 15 లక్షల నష్టపరిహారం, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.


సీఎం రేవంత్ రెడ్డికి ఆరెస్‌ఎస్‌ భావ‌జాలాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయని, బీఆరెస్‌, బీజేపీలు ఒక్క‌టే అన్న‌ రేవంత్ రెడ్డి నిన్నటి సభలో మోదీ పెద్దన్న అనడంతో రేవంత్ రెడ్డి నిజస్వరూపం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. బీజేపీ కాంగ్రెస్ ముమ్మాటికీ ఒక్కటేనని, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దనేది ఇరు పార్టీల లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు. ఆరెస్‌ఎస్‌ మూలాలు ఉన్న రేవంత్ ప్రధాని మోదీని పెద్దన్న అనడంలో అతిశయోక్తి లేదన్నారు. కానీ తెలంగాణకు బ‌డ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించకపోవడంపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. రేవంత్ రెడ్డికి పబ్లిసిటీ మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యల మీద లేదన్నారు.