MLC Kavitha | ప్రియాంకను పిలిస్తే నిరసన తెలుపుతాం
కాంగ్రెస్ గ్యారెంటీలలో రూ. 500 గ్యాస్ పథకం ప్రారంభ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ ఏ హోదాలో పిలుస్తారని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు

- 12న పూలే విగ్రహా సాధనకు ధర్నా
- ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | విధాత : కాంగ్రెస్ గ్యారెంటీలలో రూ. 500 గ్యాస్ పథకం ప్రారంభ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని పిలుస్తామని అంటున్నారని, ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తారని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక కనీసం సర్పంచ్‌గానైనా గెలిచారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని పిలిస్తే నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతామని కవిత స్పష్టం చేశారు. ఇంద్రవెల్లిలో ప్రభుత్వ సొమ్ముతో పార్టీ సభ పెట్టుకున్నారని ఆరోపించారు.
అప్పుల రాష్ట్రమని, బీఆరెస్ మాదిరిగా ప్రజాధనం దుర్వినియోగం చేయబోమంటూ నీతులు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి భారీ ఎత్తున మీడియా ప్రకటనలకు ఖర్చు పెడుతున్న సంగతేమిటని ప్రశ్నించారు. సీఎంగా నిత్యం ప్రజలను కలుస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఒక్క రోజు మాత్రమే ప్రజాదర్భార్‌కు పరిమితమయ్యారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని చేసిన హామీల పై యూటర్న్ సీఎంగా ప్రజలు భావిస్తున్నారన్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల ఘటనపై క్షమాపణలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ అమర వీరులకు కూడా క్షమాపణాలు చెప్పి తప్పు ఒప్పుకోవాలన్నారు.
కేసీఆర్ కుటుంబ పాలన అంటూ ఏడ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు 22కుటుంబాలకు టికెట్ ఇచ్చిందని కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నోటా ఇప్పటి వరకు జై తెలంగాణ అన్న మాట రాలేదని, అమరులకు కనీసం నివాళులు కూడా అర్పించలేదన్నారు. అమర జ్యోతి వద్దకు వెళ్ళే తీరిక కూడా లేదని విమర్శించారు. బీసీ జనగణన చేయకుండా బీసీలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారో కాంగ్రెస్ స్పష్టం చేయాలన్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన నియామకాల్లో ఎస్సీ, బీసీల వాట ఎంత అని నిలదీశారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేస్తామని కవిత స్పష్టం చేశారు.
తెల్లపూర్ లో గద్దర్ విగ్రహం వెనకాల రియల్ ఎస్టేట్ మాఫియా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. దీని వెనకాల ఎవరెవరూ ఉన్నారో త్వరలోనే తెలుస్తుందన్నారు. పూలే విగ్రహం వెనకాల బీసీల అభ్యున్నతి అంశం ఉందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అధ్యక్షుడు ఎక్కడినుండి పోటీ చేయనంటే అక్కడినుండి పోటీ చేస్తానన్నారు. ఈసారి అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తుందని 100 రోజుల తర్వాత కాంగ్రెస్ కు సినిమా చూపిస్తామన్నారు.