క్రూజర్లపై సీఎం రేవంత్‌రెడ్డి అనవసర వ్యాఖ్యలు: ఎమ్మెల్సీ కవిత
22 ల్యాండ్ క్రూజర్ కార్లపై మాజీ సీఎం కేసీఆర్‌పై దుష్ర్పచారం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన హోదాకు, స్థాయికి తగనివని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు

విధాత: 22 ల్యాండ్ క్రూజర్ కార్లపై మాజీ సీఎం కేసీఆర్‌పై దుష్ప్రచారం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన హోదాకు, స్థాయికి తగనివని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. శనివారం ఆమె సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ఇంటలిజెన్స్, పోలీస్ విభాగాలు సీఎం సెక్యూరిటీకి వారే సీక్రెట్‌గా కాన్వాయ్‌ను సిద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా క్రూజర్లను కొనుగోలు చేశారన్నారు. దాన్ని ఓ తప్పుగా చిత్రీకరించి, మాజీ సీఎం కేసీఆర్ ఆ కార్లను ఏదో రహస్యంగా దాచుకున్నట్లుగా రేవంత్‌రెడ్డి మాట్లాడటం అభ్యంతరకమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ద్వంద్వ విధానాలు అనుసరిస్తుందన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ జ్యూడిషల్ విచారణ నివేదిక రాకుండానే, అఖిలపక్షంను తీసుకెలుతామని చెప్పి, తీసుకెళ్లకుండా, కేవలం మంత్రులే గుంపులుగా మేడిగడ్డ బ్యారేజీ సందర్శించి కాళేశ్వరం పాపాల పుట్ట అని ఏకపక్షంగా ప్రకటించడం ఎంతవరకు సమంజసమన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడే సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయలేదని, పోటీలో లేకుండానే ఎలా ఓడిపోతామని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్మికుల వ్యతిరేక పార్టీ అని సింగరేణి ఎన్నికల్లో తేలిందన్నారు.
సమ్మక్క సారమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షల సంఖ్యలో జనం వెళతారని, ఫ్రీ బస్సులు సంఖ్య పెంచాలన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ బిల్లు ఆమోదం పొందడం ఈ ప్రాంత ప్రగతికి మేలు చేస్తుందన్నారు. మూడు నెలలుగా పెన్షన్లు పంపిణీ కాలేదని, కొత్త ప్రభుత్వమైనా జనవరి ఒకటో తేదీ నుంచి 4వేల పెన్షన్స్ ఇవ్వాలని కోరారు. 200 లోపు యూనిట్లు కరెంటు వాడే ప్రజలు జనవరి నుంచి కరెంటు బిల్లు కట్టకపోతే మంచిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తామందన్నారు.
హామీల అమలుకు మా నాయకుడు కేసీఆర్ వందరోజులు సమయం ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారని, వంద రోజుల తర్వాత ఖచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ కావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం 15 వేల కోట్లు మంజూరు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మేడారం జాతర కు 100 కోట్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజలలో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. నిరుద్యోగ భృతి హామీ వారి గ్యారంటీ పధకాల దరఖాస్తులలో కనిపించడం లేదన్నారు.